భక్తులందరూ సామూహిక సంకీర్తనా మహోత్సవంలో పాల్గొనండి
భక్తులందరూ సామూహిక సంకీర్తనా మహోత్సవంలో పాల్గొనండి
తిరుపతి, జూన్-12, 2009: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని 32000 సంకీర్తనలలో స్తోత్త్రము చేసిన పరమభక్తాగ్రేసరుడు, తొలితెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. కలియుగంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుని మెప్పించి, ప్రసన్నంచేసుకోవడానికి యజ్ఞయాగాదులు అవసరం లేదు. హోమాదులు అవసరం లేదు. త్రికరణశుద్దిగ ఆ భగవంతుని గుణనామ సంకీర్తనం చేయడం వల్ల సంప్రీతుడై కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు భక్తులపై కరుణామృతం చిలుకరిస్తున్నాడు. శ్రీమద్బాగవతం, అమృతబిందు ఉపనిషత్తు మొదలైన గ్రంథాలు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. భగవత్ భాగవత కైంకర్యమైన నామ సంకీర్తనా సంప్రదాయాన్ని బహుళ వ్యాప్తం చేయడానికే అన్నమయ్య 32000 సంకీర్తనలను రచించాడు. నాద ప్రియుడైన శ్రీనివాసుని ఆర్తితో, శరణాగతితో, మధుర భక్తి భావనాబలంతో ఎలా ఉపాసించాలో తన సంకీర్తనల ద్వారా భక్తలోకానికి ప్రభోదించాడు అన్నమయ్య.
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్లనడగించు సంకీర్తనం || పల్లవి ||
సంతోషకరమైన సంకీర్తనం
సంతాపమణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతము దలచుడీసంకీర్తనం || చాల ||
సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణుసంకీర్తనం || చాల ||
జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ది వోడమించు సంకీర్తనం
జమళిసౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదుల జేయు సంకీర్తనం || చాల ||
జలజాసనునినోరి సంకీర్తనం
చలిగొండసుతదలచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలచుడీసంకీర్తనం || చాల ||
సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగనను దలచు డీసంకీర్తనం || చాల ||
అన్నమయ్య ఈవిధంగా పేర్కొన్న సంకీర్తనా మహత్త్వాన్ని తెలిసికొని జీవులందరు తదేక భక్తి భావంతో శ్రీనివాసుని పాదపద్మములు ఆశ్రయించాలి అనే భావనతోనే తి.తి. దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్ట్‌తరపున సప్తగిరి సంకీర్తన బృందగానాన్ని ప్రోత్సహిస్తూ వుంది. వేలాది మంది భక్తులు ముక్తకంఠంతో, తన్మయత్వంతో, మధురభక్తి పారవశ్యంతో సప్తగిరి సంకీర్తనాలాపన చేస్తూ శ్రీనివాసుని పాదారవింద మకరంద రసాన్ని ఆస్వాదించాలి అనే తపనతో ఈ సామూహిక బృందగానం మనం నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ ఈ సామూహిక సంకీర్తనా మహోత్సవంలో పాల్గొని శ్రీవేంకటేశ్వరుని కరుణాకటాక్షాలను పొందవలసినదిగా అభ్యర్థిస్తున్నాం.
డా.కె.వి.రమణాచారి, ఐ.ఏ.ఎస్.,
కార్యనిర్వహణాధికారి,
తి.తి.దేవస్థానములు, తిరుపతి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.