భక్తుల్లో భగవంతుడిని చూడండి : తితిదే ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో జెఈవో

భక్తుల్లో భగవంతుడిని చూడండి : తితిదే ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో జెఈవో

తిరుపతి, సెప్టెంబరు 27, 2013: తితిదే ఉద్యోగులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భగవంతుడిని చూడాలని,  పవిత్రమైన హృదయంతో నిస్వార్థ సేవలందించాలని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు  సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డెప్యుటేషన్‌పై విధులు నిర్వహించనున్న ఉద్యోగులకు తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ డెప్యుటేషన్‌లో ఉన్న ఉద్యోగులు తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా అలిపిరి నుండి తిరుమలకు రవాణా వసతి కల్పిస్తామని తెలిపారు. వాహన సౌకర్యం లేని ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రత్యేక వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉద్యోగులు హోదాలతో సంబంధం లేకుండా అందరితో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, డెప్యూటీ ఈవో(సేవలు) శ్రీ శివారెడ్డి, ఎస్‌ఈ శ్రీ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.