మంత్రాలయ క్షేత్రానికి తక్షణ సహాయ చర్యల కోసం తితిదే సన్నద్ధం
మంత్రాలయ క్షేత్రానికి తక్షణ సహాయ చర్యల కోసం తితిదే సన్నద్ధం
తిరుపతి, అక్టోబర్-3, 2009: కర్నూలు జిల్లాలో గల శ్రీరాఘవేంద్రస్వామి నిలయమైన మంత్రాలయ క్షేత్రం వరదపోటుకు జలదిగ్బంధంలో వున్నందువలన ఆ ఆలయంలో యధావిధిగా రోజువారి పూజా కార్యక్రమాలు జరిగేందుకు వీలుగా తక్షణ సహాయ చర్యలు తీసుకోవడానికి తితిదే సన్నద్దమైంది. ఇందుకై తితిదే దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థుల వారిని మంత్రాలయ క్షేత్రం నిర్వాహకులకు అందుబాటులో వుంటూ వారి అవసరాలను తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయనను తితిదే కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న బాధితులను ఆదుకోవడానికి తితిదే సమాయత్తమైంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు నేడు 30వేల పులిహోర ప్యాకెట్లను పంపుతున్నది. రేపు మరో 15వేల పులిహోర ప్యాకెట్లను పంపనున్నది. అదేవిధంగా భోజనం ప్యాకెట్లతో పాటు దుప్పట్లను కూడా పంపుతున్నది. ఇవన్నీ కర్నూలు జిల్లా కలెక్టర్కు అందజేయబడుతాయి. అంతేగాకుండా వరదల వలన నిరాశ్రయులైన బాధితుల కొఱకు తితిదే ఉద్యోగులు తమ ఒక్కరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆదేవిధంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులు నాలుగు లక్షల చపాతీలను బాధితులకకొఱకు ప్రత్యేక వాహనాలలో ఆదివారం ఉదయం కర్నూలుకు చేరవేసి కలెక్టరుకు అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.