KAPILESWARA ON MAKARA _ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

Tirupati, 04 March 2024: Sri Kapileswara flanked by Kamakshi Devi took out a celestial ride on Makara Vahanam on Monday morning.

The fourth day witnessed the deities gliding along the streets of Tirupati spreading religious fervour.

Temple officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

తిరుప‌తి, 2024, మార్చి 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

 మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.

 అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.