మ‌న‌గుడిపై ఈవో స‌మీక్ష‌

మ‌న‌గుడిపై ఈవో స‌మీక్ష‌

తిరుమల, 31 జూలై  2013 : భక్తులకు పాపభీతి-దైవప్రీతి తెలిపి ఆధ్యాత్మిక భావాలను చైతన్యవంతం కావించే బృహత్తర కార్యక్రమమే మనగుడి కార్యక్రమమని తితిదే ఇఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు.

శనివారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో మనగుడి తొలివిడత సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా తితిదే ఇఓ మాట్లాడుతూ గత రెండు విడుతలలో నిర్వహించిన మనగుడి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తుల నుండి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. తొలివిడత గత ఏడాది ఆగష్టు 2వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా 13242 ఆలయాల్లో, రెండవ విడత నవంబరు 28 కార్తీక పౌర్ణమినాడు 17536 ఆలయాల్లో విజయవంతంగా దేవాదాయ శాఖ సహకారంతో నిర్వహించామన్నారు. కాగా మూడవ విడత కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగష్టు 21 శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తొలి రెండు విడుతల కన్నా ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో, మరింత శోభాయమానంగా నిర్వహించాలని ఆయన తితిదే అధికారులను సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి మరియు కమీషనరులను కూడా సంప్రదించి వారి సమన్వయంతో కార్యక్రమ ప్రణాళికను రూపొందించి ఆయా జిల్లాల్లో మనగుడి ఘనంగా నిర్వహించడానికి యోచిస్తున్నామని తెలిపారు.
కాగా మూడవ విడత మనగుడి కార్యక్రమాల పట్టికను హిందూధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి మరియు ఇంఛార్జీ కార్యదర్శి అయిన శ్రీ రఘునాధ్‌ సమావేశంలో నివేదించారు. ఇందులో భాగంగా –
జూలై 13 : మనగుడి పోస్టర్ల విడుదల, జిల్లా హిందూధర్మప్రచారపరిషత్‌ సభ్యులకు మరియు అర్చక శిక్షకులకు మనగుడి కార్యక్రమ ఏర్పాట్లపై శిక్షణ, వారిచే ప్రచారం.
ఆగష్టు 7 : ఆలయ శోభ కార్యక్రమం- కొన్ని పురాతన దేవాలయాలకు ముఖ్యంగా దళితవాడల్లో ఉన్న వాటికి నూతన శోభను కల్గించేందులో భాగంగా రంగులు అద్దడం.  
ఆగష్టు 11 :   గరుడ పంచమి సందర్భంగా మనగుడి కార్యక్రమం కరపత్రాల పంపిణీ, 23 జిల్లాలలో ప్రముఖ పండితులచే మనగుడి ప్రాశస్త్యంపై ప్రవచనాలు, ఎస్వీబీసి మరియు స్థానిక ఛానల్స్‌ ద్వారా ప్రచారం.
ఆగష్టు 12 :  రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో కుంకుమార్చన
ఆగష్టు 14 : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గోపూజ
ఆగష్టు 15 : విద్యార్థులచే పద్యపఠనం
ఆగష్టు 16 :  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం
ఆగష్టు 17 :  రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సత్యనారాయణ వ్రతం

ఈ కార్యక్రమాలే కాకుండా ప్రతి జిల్లాకు ధర్మప్రచార రథాలతో మనగుడి కార్యక్రమాన్ని విరివిగా ప్రచారం చేయడం. ఆయా జిల్లాల్లోని భజన మండళ్ళు, శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఇంటింటా ప్రచారం చేయించడం మొదలైనవి.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఓ శ్రీ వెంకట్రామిరెడ్డి, సి.వి.ఎస్‌.ఓ. శ్రీ జి.వి.జి. ఆశోక్‌కుమార్‌, ఆదనపు ఆర్థికశాఖాధికారి శ్రీ బాలాజీ, డిప్యూటీ ఇఓలు శ్రీ చిన్నంగారి రమణ, శ్రీమతి చెంచులక్ష్మి, శ్రీ ఉమాపతి రెడ్డి, శ్రీమతి వనజ, ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు శ్రీ శ్రీనివాసులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.