మహతి ఆడిటోరియంలో సురభి వారి పౌరాణిక నాటకాలు

మహతి ఆడిటోరియంలో సురభి వారి పౌరాణిక నాటకాలు

తిరుపతి, జూన్‌-12,  2009: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ నెల 13వ తేది నుండి 15వ తేది వరకు మూడురోజుల పాటు సురభి వారి పౌరాణిక నాటకాలు యేర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6.15ని||లకు మహతి ఆడిటోరియంలో సురభి వారి మాయాబజార్‌ పౌరాణిక నాటకం, 14,15వ తేదీలలో అదే సమయానికి శ్రీనివాస కళ్యాణం నాటకాలను సురభి సమాజం వారు ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. సురభి వేణుగోపాల్‌ ఆద్వర్యంలో 72 మంది కళాకారులు ఈ ప్రదర్శనలలో పాల్గొంటారని శ్రీరమణాచారి తెలిపారు.

రాష్ట్రంలో పౌరాణిక నాటకాలకు సరభివారు ఆద్యులని, దాదాపు వంద సంవత్సరాలకు పైగా ఈ సమాజం నాటకరంగానికి తమ సేవలు అందించారని ఆయన తెలిపారు. 124 సంవత్సరాల కిందట సురభివారు కడప జిల్లాలో మొట్టమొదట ‘కీచక వధ’ అనే నాటకాన్ని ప్రదర్శించారని, 1931వ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి ‘టాకీ’ చిత్రం భక్తప్రహ్లాద చిత్రంలో నాయిక కూడా సురభికి చెందిన కమలాభాయేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నాటక సంప్రదాయన్ని నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ సురభి సమాజమేనని శ్రీ రమణాచారి తెలిపారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.