మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరం
మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరం
తిరుపతి, నవంబర్-04,2009: మానసిక సైర్యానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, తితిదే ఉద్యోగులు క్రీడాస్పూర్తితో స్నేహపూర్వకంగా క్రీడలలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా క్రీడలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈసందర్భంగా ఇఓ ఈక్రీడలలో పాల్గొని, బహుమతులు గెలుచుకొన్నవారికి శుభాకాంక్షలు తెలుపుతూ నిరంతరం శ్రీవారి సేవలో, భక్తజన సేవలో తరించాలని సూచించారు.
అనంతరం తితిదే ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పి.వి.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక మంది ఉద్యోగులు క్రీడలలో పాల్గొన్నారని ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అధికశాతం పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారని కొనియాడారు. రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు సైతం ఈ క్రీడలలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం కార్యనిర్వహణాధికారి, సంయుక్త కార్యనిర్వహణాధికారి ఉద్యోగులకు ఉత్తమసేవాపురష్కారాలను, క్రీడలలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జె.ఇ.ఒ. యువరాజ్, డి.ఇ.ఒ. విధ్యారణ్యస్వామి, ఉద్యోగసంఘం నాయకులు మోహన్‌రెడ్డి, విజయకుమార్, తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.