రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం

– భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోతున్న నేటి సమాజంలో మన సంస్కృతిపై మక్కువ పెంచి దేవాలయాలను కాపాడుకునే బాధ్యతను పౌరులలో పెంచేందుకే ఈ మనగుడి కార్యక్రమం.

– శ్రావణ పౌర్ణమి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణం పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13,773 ఆలయాల్లో మనగుడి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

– అన్ని ఆలయాల్లో ఉదయం 5.00 గంటల నుండి నామసంకీర్తనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

– ఆయా ఆలయ సంప్రదాయరీతిలో అభిషేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్ర సమర్పణ జరిగాయి.

– తిరుమల నుండి  వచ్చిన పసుపు, కుంకుమలతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవతల ముందుంచి, కుంకుమార్చనలు, సౌభాగ్యవ్రతాలు చేయడం జరిగింది.

– రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల కంకణాలను ఈ శుభదినాన భక్తులు ధరించడం జరిగింది.

– హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లోని బాలాజీమందిరంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌, మంత్రి శ్రీ దానం నాగేందర్‌ మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ|| శ్రీ రామచంద్రయ్య గుడిమల్కాపురంలోని ఆలయంలో మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

– సాయంత్రం 4.00 గంటల వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 13,773 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

– దాదాపు 65 లక్షలా 40 వేల మంది భక్తులు పాల్గొనగా 68 లక్షలా 42 వేల కంకణాలను పంపిణీ చేయడం జరిగింది.

–  రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మనగుడి కార్యక్రమంలో ఎం.పిలు, ఎం.ఎల్‌.ఏలు, ఎం.ఎల్‌.సిలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

– దేవాలయాలను ఆయా గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి శుద్ధి చేసుకోవడం, ప్రతి ఇంటిని, గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవడం, వీధుల్లో రంగవల్లులు దిద్దడం చేశారు. అదేవిధంగా ఆయా ఆలయాలను భక్తులే స్వచ్ఛందంగా అలంకరించుకున్నారు.

– ఈ శుభదినాన రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దేవతా మొక్కలు(రావి, జువ్వి, తులసి, వేప, తెల్లజిల్లేడు వంటివి) ఆలయ ప్రాంగణంలో నాటారు.

– ఆలయ ప్రాంగణం నందు ఆయా గ్రామాల్లోని భజన మండళ్లతో భజనలు చేయడం, సాయంత్రం హరికథా, పురాణ ప్రవచనం, భక్తి సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

– అనేక ప్రాంతాల్లో రథయాత్రలు, ఊరేగింపులు భక్తుల కోలాహలంతో సాగాయి.

– ఈ మనగుడి కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,000 ఆలయాల్లో ఉత్సవం నిర్వహించడం జరిగింది.

– నెల్లూరు జిల్లాలో మహిళలకు లతామంగేష్కర్‌ ఆలపించిన భక్తిపాటల సీడీలను, పసుపు కుంకుమ, కంకణాలను అందించడం జరిగింది.

– దాదాపు వేయి దేవతామొక్కలను రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నాటడం జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.