రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు
తిరుపతి, మార్చి-31, 2009: వినికిడి లోపం గల శిశువును గుర్తించి వారికి మాటలు వచ్చే విధంగా చేయడానికిగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి డా.కె.వి.రమణాచారి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పాత ప్రసూతి అసుపత్రిలో ఏర్పాటు చేసిన శ్రవణం ప్రాజెక్ట్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అను ఉద్దేశ్యంతో తితి దేవస్థానములు అనేక సమాజహిత కార్యక్రామాలు చేస్తున్నదని వీటిలో శ్రవణం ప్రాజెక్ట్ ఒకటని తెలిపారు. 2006 డిశెంబర్ 16వ తేదిన ప్రారంభించిన ఈ శ్రవణం ప్రాజెక్ట్‌లో 1 సంవత్సరం కోర్సు పూర్తి చేసిన టీచర్స్ ద్వారా ఇక్కడ పిల్లలకు శిక్షణ నిస్తూన్నామని, శ్రవణంలో చేరిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ శ్రవణం ప్రాజెక్ట్ టీచర్ల ఓపిక, పిల్లలపై ప్రేమాభిమానాల వలనే సవ్యంగా నడుస్తుందని టీచర్లు ఇదే ఉత్సాహంతో పిల్లల వికాసానికి బాగా కృషి చేయాలని అన్నారు. దాదాపు రు.30 లక్షల ఖర్చుతో నిర్మించిన క్లాస్ రూములు, పిల్లల వినికిడికై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను చక్కగా ఉపయోగించుకొని, ఇక్కడ చేరే ప్రతి విద్యార్థి స్వామి ఆశీస్సులతో మిగతా పిల్లలవలె ప్రవర్ధమానం చెందాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా ఈ శ్రవణం ప్రాజెక్ట్ తిరుపతిలో వున్నదని ప్రపంచానికి తెలియజేసి ఎంతో మంది చిన్నారులను ఇక్కడకు రప్పించి వారికి మంచి వైధ్యం కల్పించేందుకు దోహదం చేసిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో శిక్షణ తీసుకుంటున్న పిల్లల తల్లులు కరీంనగర్ నుండి వచ్చిన సరస్వతి, చిత్తూరు జిల్లా పాకాల నుండి వచ్చిన సునీతలు, తితిదే ముఖ్య వైధ్యాధికారి ప్రసంగించగా, తితిదే జెఇఓ శ్రీ వి.శేషాద్రి, ముఖ్య భద్రతాధికారి శ్రీ పి.వి.ఎస్. రామకృష్ణ, ఛీఫ్ ఇంజనీరు శ్రీ వి.ఎస్.బి. కోటేశ్వర రావు, చెన్నై బాలవిద్యాలయంకు చెందిన శ్రీమతి నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.