లోక క్షేమార్థమే వేద ధర్మం – ప్రొ. హరేకృష్ణ శతపతి

లోక క్షేమార్థమే వేద ధర్మం – ప్రొ. హరేకృష్ణ శతపతి

 తిరుమల, 1 ఆగష్టు  2013 : భారతదేశానికి తనువు, మనసు, ఆత్మ అయిన వేదం ప్రపంచానికే అదర్శనీయమని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య హరేకృష్ణ శతపతి ఉద్ఘాటించారు.

గురువారం నాడు ధర్మగిరిలోని వేదపాఠశాలను సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్ధేశించి వేద ధర్మం గురించి ఉపన్యసించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ధర్మం సంవిధానమన్నారు. అట్టి ధర్మాన్ని ప్రబోధించేది వేదమన్నారు. భగవత్‌ శంకరాచార్యుల వంటి వారు తమ 8వ ఏటనే చతుర్వేదాలను, 12వ ఏటికల్లా అన్ని శాసనాలను, 16 ఏళ్ళ ప్రాయానికల్లా ప్రస్థానత్రాయాన్ని అభ్యసించారన్నారు. వారందించిన స్ఫూర్తితో విద్యార్థులు వేదాన్ని అనుష్ఠానము చేయాలని ఆయన కోరారు. తద్వారా భావితరాలకు వేద విజ్ఞానాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్థానములో విద్యనభ్యశించడం మహాద్భాగ్యం అన్నారు.

అంతకు పూర్వం వివిధ విభాగాలకు చెందిన వేద విద్యార్థులు ఋగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్ల యజుర్వేదం, తైత్తరీయశాఖలోని పంచకాటకాలు, సామవేదం, అదర్వణవేదం, శైవాగమం, వైష్ణవాగమం, పాంచరాత్ర ఆగమం మొదలైన శాఖలలోని మంత్ర పుష్పాలను నివేదించారు.

ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య శ్రీ కె.ఎస్‌.ఎస్‌. అవధాని, ఇతర అధికారులు, వేద అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

   తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.