విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి 

విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి

తిరుపతి, జూన్‌ 08, 2011: తితిదే పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించడానికి తితిదే కృషి చేయాలని శ్రీవారి సద్భావన వేదిక ఒక ప్రకటనలో తితిదేని కోరింది. అవసరమైన సందర్భంలో తితిదేకి మంచి సలహాలు అందించడానికి ఏర్పాటు అయిన మేధావులతో కూడిన శ్రీవారి సద్భావన వేదిక బుధవారం స్థానిక భారతీయ విద్యాభవన్‌లో సమావేశం అయినది.
 
ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ తితిదే పాఠశాలలో ఉన్న అధ్యాపకులకు మంచి శిక్షణను ఇప్పించి వారి ద్వారా పిల్లలకి నాణ్యమైన విలువలతో కూడిన విద్యను బోధించడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా శిక్షణను ఇప్పించడానికి భారతీయ విద్యాభవన్‌ సహకారం అందిస్తుందని వారు తెలిపారు. అదే విధంగా పిల్లలకి బాలభారతి పేరున్న తితిదే ప్రచురించిన అనేక పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి రైళ్ళలో వచ్చు భక్తులు ముఖ్యంగా రేణిగుంట వద్ద సిగ్నల్‌ పాయింట్‌ వద్ద గంటల తరబడి రైళ్ళను ఆపి ఉంచడం వలన వారికి ఇబ్బందులే కాకుండా వారి విలువైన సమయం కూడా వృధా అవుతున్నదని, దీనిని నివారించడానికి తితిదే వెంటనే రైల్వే అధికారులతో చర్చించాలని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసేందుకు చొరవ తీసుకోవాలని వారు టిటిడిని కోరారు.
తిరుమల కన్నా తిరుపతిలోనే ఎక్కువ శాతం వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి భక్తుల ఇబ్బందిని తొలగించాలని, తిరుమలలో ప్రస్తుతం భక్తులకు ఇస్తున చిన్న లడ్డూలను ఆపివేసి వాటి స్థానంలో ప్రతి ఒక్కరికి బూందీని ప్రసాదంగా ఇవ్వాలని వారు కోరారు.
 
అదేవిధంగా తిరుపతిలో ఆధ్యాత్మికత పెంపొందించడానికి ధర్మప్రచార పరిషత్‌ లాంటి విభాగాల ద్వారా మంచి కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రజలలో భక్తి, ఆధ్యాత్మికత పెంచడానికి కృషి చేయాలని వారు అభిప్రాయపడ్డారు. తిరుమలలో లడ్డూలకు, వసతి, దర్శనానికి సంబంధించి భక్తులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి నూతన సంస్కరణల ద్వారా అటు దళారీలను ఏరివేసి ఇటు భక్తులకు మేలు కలిగించే చర్యలు తీసుకున్న తితిదే ఇఓ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు గారు అభినందించారు.
 
ఈ సమావేశములో తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, శ్రీవారి సద్భావన వేదిక సభ్యులు  ప్రొ.బి. మురళి, శ్రీ యమ్‌.దొరైరాజ్‌, డాక్టర్‌ యన్‌.సత్యనారాయణరాజు, శ్రీ ఆర్‌.వి. జగ్గారావు, శ్రీ టి.కైలాష్‌, ప్రొ. పి.వి.రెడ్డి, ప్రొ.రామకృష్ణ, ప్రొ. అల్లాడి మోహన్‌, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, శ్రీ టి. సుదర్శనరాజు తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.