వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు
వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి యేర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థానం అమృతోత్సవ కార్యక్రమాలను యేర్పాటు చేసిందని, యీ చారిత్రాత్మక సంఘటనలో పాలుపంచుకునే ప్రతి వ్యక్తికి జీవితాంతం గుర్తించుకునే మదురాను భూతులు మాత్రమే మిగలాలని తాను మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలిపారు. కాని యిందుకు భిన్నంగా మీడియాలో కథనాలు రావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అమృతోత్సవాల సందర్భంగా కాని, మరే యితర సందర్భంలో కాని తానెలాంటి చేదు అనుభావాలు ఎదుర్కోలేదని శ్రీకె.వి.రమణాచారి స్పష్టం చేశారు.
భారత రాష్ట్రపతి తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో మహాద్వారం దగ్గర డ్యూటిలో యున్న విజిలెన్సు అధికారులను తాను ప్రశంసించానని, కాని ఆ విషయాన్ని దూరంగాయున్న మీడియా అపార్థం చేసుకొని విరుద్ధమైన కథనాలు ప్రచురించాయని తి.తి.దే కార్యనిర్వహణాధికారి తెలిపారు. అంతేగాకుండా, ఆసమయంలో తన వెనుకభాగంలో యితర సీనియర్ అధికారులు కూడా యున్నారని ఆయన తెలిపారు.
అదేవిధంగా, అమృతోత్సవాల ప్రారంభసమావేశంలో తి.తి.దే కార్యనిర్వహణాధికారిగా సభకు అధ్యక్షత వహించానని, ఆసమయంలో తానే పాలకమండలి సభ్యుడిని వేదిక పైన ఆసీనుణ్ణి చేశానని, యీ విషయాన్ని మరొక విధంగా వర్ణించడం భావ్యం కాదని ఆయన తెలిపారు. దేశాధ్యకక్షురాలు వేదికపై యుండగా, బాధ్యతగల అధికారిగా, సభాధ్యకక్షునిగా తాను అనేక బాధ్యతలు నిర్వర్తించానని, యీ విషయంలో ఎలాంటి అపార్థాలకు తావులేదని శ్రీకె.వి.రమణాచారి తెలిపారు.
ఇలాంటి అతి మఖ్యమైన విషయాలలో అపార్థాలకు వివాదాలకు తావుండకూడదని, ఉద్యోగ సోదరులు కూడా అర్థం చేసుకోవాలని తి.తి.దే కార్యనిర్వహణాధికారి కోరారు. ఇలాంటి అనవసరమైన వివాదాలకు సహృదయంతో ముగింపు పలకాలని ఆయన కోరారు.
అదే విధంగా, రాష్ట్రగవర్నరు గారిని ఆహ్వానించే విషయంలో మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయని, అవికూడా అవాస్తవమని, కేవలం అపోహమాత్రమేనని ఆయన అన్నారు. జూన్ నెల 25వ తేదీననే తి.తి.దే పాలకమండలి అద్యకక్షులు శ్రీభూమనకరుణాకరరెడ్డి, తాను స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నరు గారిని ఆహ్వానించామని ఆయన తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.