వేదపాఠశాలను సందర్శించిన ఉత్తరాది మఠం పీఠాధిపతి
వేదపాఠశాలను సందర్శించిన ఉత్తరాది మఠం పీఠాధిపతి
తిరుమల, 14 జూలై 2013 : ఉత్తరాధి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సత్యాత్మ తీర్థస్వామిజీ ఆదివారం నాడు ధర్మగిరిలోని వేదపాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన వేద విద్యార్థులు ఋగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్ల యజుర్వేదం తైత్తరీయశాఖలోని పంచకాటకాలు, సామవేదం, అదర్వణవేదం, శైవాగమం, వైష్ణవాగమం, పాంచరాత్ర ఆగమం మొదలైన శాఖలలోని మంత్ర పుష్పాలను నివేదించారు.
అనంతరం ఆయన వేదాలు మరియు ఉపనిషత్తుల గురించి విద్యార్థులకు తన అనుగ్రహభాషణంలో విఫులీకరించారు. వేద భాష్యాన్ని మరియు వేద శాస్త్రాలను అధ్యయనం చేయాలని తెలిపారు. వేదాల గురించి ప్రచారం కల్పించాలని వేద విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ధర్మగిరి వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ఆయన ప్రశంసించారు. అటు తరువాత వేద పాఠశాల అధ్యాపకులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య శ్రీ కె.ఎస్.ఎస్. అవధాని, ఇతర అధికారులు, వేద అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.