వేద పారాయ‌ణం వ‌ల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది – ఆచార్య శ్రీ హరేకృష్ణ

వేద పారాయ‌ణం వ‌ల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది – ఆచార్య శ్రీ హరేకృష్ణ

తిరుపతి, 2010 మార్చి 03: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వేద సదస్సులోభాగంగా రెండవ గోష్ఠి సాయంత్రం 5 గంటలకు మొదలైనది. రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి శ్రీఆచార్య హరేకృష్ణ శతపతి దీనికి అధ్యక్షత వహించారు.

మొదట తిరుపతి ఎస్‌.వి. వేద విశ్వవిద్యాలయమునకు చెందిన శ్రీ సుబ్రహ్మణ్య భేడే – ”కామ్యపశువులకు – మంత్ర బ్రహ్మణ సంబంధము – లోకోపకారత్వము” అనే విషయంపై ప్రసంగించారు. ప్రాణులన్నీ ఇష్టం కలగాలనీ, అనిష్టం కలగకూడదని అనుకుంటాయని ఈ రెండు నెరవేర్చుట వేదం ప్రయోజనమని చెప్పారు. వేదాలలో అనేక కామ్యేష్టులు చెప్పబడినవని, ఐశ్వర్యం కోరేవారు, రాజ్యంకోరే వారు, పశువులు కోరేవారు, వ్యాధులను పోగొట్టుకోదలచినవారు ఆయా ఇష్టులను నిర్వహిస్తే వాటిని పొందుతారని చెప్పారు. సంతానం కావలసిన వారు సంతానాన్ని పొందే ఉపాయం వేదం చెప్పిందన్నారు.
 
ఆ తరువాత గుజరాత్‌కు చెందిన శ్రీ కపిలదేవ హరేకృష్ణ శాస్త్రిగారు ”వైదిక సాహిత్యవిజ్ఞానం” అనే విషయంపై ప్రసంగించారు. విశ్వవైదిక సాహిత్యంలో సూర్యుని మహిమవర్ణించబడిందని చెప్పారు. ఋగ్వేదం సూర్యుడు నిఖిలభువనాలను ప్రకాశింపజేస్తాడని చెప్పిందని, అథర్వవేదం సూర్యుడు జగత్తుకు ఆత్మయని వర్ణించిందనీ సూర్యుడు చరాచర జగత్తుకు జీవనాధారమని, జగచ్చకక్షువు, లోకలోచనుడు, అంధకారాన్ని పోగొట్టి జగత్తుకు వెలుగును ప్రసాదించే స్వయం ప్రకాశకుడని, సూర్యుడు ప్రాణం వంటి వాడని వర్ణించిందని చెప్పారు. సూర్యుడు లేకపోతే జగత్తు అంధకారము అవుతుందన్నారు.
 
తరువాత తిరుపతికి చెందిన శ్రీరామచంద్ర జోషి గారు ”అథర్వవేదం – ఆయుర్వేదముల సమన్వయం” అనే అంశంపై ప్రసంగించారు. ఆదిశేషుడే చరకుడుగా అవతరించి ఆయుర్వేదాన్ని ప్రసాదించాడన్నారు. మత్స్యావతారంలో భగవంతుడు వేదాలను ఉద్ధ్దరించాడన్నారు. అథ ర్వవేదం నుండియే ఆయుర్వేదం పుట్టిందన్నారు.

ఆపైన, వారణాశికి చెందిన ఆచార్య కృష్ణశర్మగారు ”వేదాలలో లోకోపకారభావన” అనే అంశంపై  ప్రసంగించారు. వేదములలో మానవతావిలువలు చెప్పబడినవని మానవ ధర్మాలు లేనివాళ్ళు ఆకార మానవులేకాని, నిజమానవులు కాలేరని, మంచినే చూడాలని, మంచినే వినాలని వేదం చెప్పిందన్నారు. మనస్సు పవిత్రంగా ఉండాలని, సమాజ కల్యాణం కోసం ప్రయత్నించాలని అన్నారు.

ఆతరువాత సభాధ్యకక్షులు శ్రీ హరేకృష్ణశతపతి గారు మాట్లాడుతూ వేదాలు ఇష్టప్రాప్తిని కలిగిస్తాయని లోకకల్యాణం చేకూర్చుతాయని చెప్పారు. ఇదే వేదాల ప్రయోజనం అన్నారు.

చివరగా అధ్యకక్షుణ్ణి, వక్తలను సన్మానించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.