VASANTHOTSAVAM IN SRINIVASA MANGAPURAM COMMENCES _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2024 మే 27: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
మే 28న స్వర్ణరథోత్సవం
మే 28వ తేదీ మంగళవారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.