శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2020 ఆగస్టు 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా రుత్విక్వరణం, మృత్సంగ్రహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఆ తరువాత అంకురార్పణ జరిగింది.
కాగా, ఆగస్టు 28న ఉదయం పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 30న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యర్ స్వామి,ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీరాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.