శేషాద్రిస్వామి మరణం నాకు వ్యక్తిగతంగా నష్టం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

శేషాద్రిస్వామి మరణం నాకు వ్యక్తిగతంగా నష్టం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

– స్వామి సేవలోనే తనువు చాలించాలనే ఆయన కోరిక నెరవేరింది : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

– ఆయన నిస్వార్థ పరుడు : డిప్యూటీ సిఎం శ్రీ నారాయణ స్వామి

– స్వామి సేవకే ఆయన జీవితం అంకితం చేశారు : ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి

– శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల నివాళులు

తిరుపతి 30 నవంబరు 2021:  తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ శేషాద్రి స్వామి తో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శేషాద్రి స్వామి మరణం తనకు, తన కుటుంబానికి తీరనిలోటని నివాళులర్పించారు.

తిరుపతిలో మంగళవారం ఆయన శ్రీ శేషాద్రి స్వామి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాద్రి స్వామి తిరుమల కు సంబంధించిన విశేషాలు, సేవలు, ఉత్సవాల విశేషాలను ప్రముఖులకు చక్కగా వివరించే వారన్నారు. 43 సంవత్సరాలుగా ఆయన శ్రీవారి సేవ చేస్తూ తుది శ్వాస కూడా స్వామి సేవలోనే వదిలారన్నారు. తిరుమలలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాలు, సేవలకు సంబంధించిన విషయాలతో శేషాద్రి స్వామి క్రోఢీకరించిన పుస్తకాన్ని టిటిడి ముద్రించి భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ చెప్పారు. ప్రముఖులు ఎవరొచ్చినా శేషాద్రి స్వామి తో ఫోటో దిగకపోతే తిరుమల యాత్ర చేసిన అనుభూతి ఉండేది కాదన్నారు. ఇకమీదట తాను తిరుమలకు వస్తే ఆ రకమైన అనుభూతి ఊహించుకోలేనని ఆయన పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శేషాద్రి స్వామి ఆత్మకు శాంతి కలిగించాలని కోరారు.

స్వామి వారు ఆయన చివరి కోరిక తీర్చారు : టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలోనే తనువు చాలించాలనుకున్న శేషాద్రి స్వామి కోరికను శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తీర్చారని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాద్రి స్వామితో తనకు 25 సంవత్సరాలుగా అనుబంధం ఉందని చెప్పారు. ఆయన కరోనా వ్యాధి బారిన పడి కోలుకున్నప్పటికీ , నిరంతరం స్వామివారి సేవ లోనే ఉండేవారిని చెప్పారు. వయసు రీత్యా ఎక్కువ దూరం ప్రయాణించవద్దని సలహా ఇచ్చినప్పటికీ , విశాఖపట్నంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం లో పాల్గొనాలని వెళ్ళి , స్వామి వారి సేవలోనే చివరి శ్వాస విడిచిన ధన్య జీవి అని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శేషాద్రి స్వామి కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థించారు.

ఆయన నిస్వార్థ పరుడు : డిప్యూటి సి ఎం శ్రీ నారాయణ స్వామి

శేషాద్రి స్వామి కాలేజీలో తనకు సీనియర్ అని డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి చెప్పారు. శేషాద్రి స్వామి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాద్రి స్వామి నిస్వార్థ పరుడని, చివరి శ్వాస వరకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలోనే తరించారని చెప్పారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరారు.

స్వామి సేవకే అంకితమయ్యారు : శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఎమ్మెల్యే
శేషాద్రి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవకే జీవితం అంకితం చేశారని శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు
శేషాద్రి స్వామి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి సేవకు జీవితం అంకితం చేసిన ఎంతో మంది భక్తాగ్రేసరుల్లో శేషాద్రి స్వామి ఒకరని అన్నారు.

ఆయన లేని లోటు తీరనిది : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

శ్రీవారి సేవలో నిరంతరం గడిపిన శ్రీ శేషాద్రిస్వామి లేని లోటు తీరనిది టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అన్నారు.
శేషాద్రిస్వామి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. 43 సంవత్సరాలు శేషాద్రిస్వామి శ్రీవారి సేవలో పాల్గొని ఆయన సేవలోనే పరమపదించారన్నారు. స్వామివారి ఆలయంలో జరిగే నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల సేవలు, ఉత్సవాల నిర్వహణ విషయంలో అర్చకులు, జియ్యంగార్లు, అధికారులకు సంధాన కర్తగా వ్యవహరించారని చెప్పారు.

రాష్ట్ర మంత్రి శ్రీ చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారు శ్రీ అజేయ కల్లం, ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ వైద్య నాథన్ కృష్ణ మూర్తి, చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి,టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఎ సి ఏ ఓ శ్రీ బాలాజి, టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం, మాజీ
జెఈవో లు శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస రాజు, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ్ తో పాటు పలువురు టీటీడీ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, శ్రీ శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు.

అంతిమయాత్ర

మంగళవారం మధ్యాహ్నం శ్రీ శేషాద్రి స్వామి పార్థివ దేహానికి పాత ప్రస్తూతి ఆసుపత్రి సమీపంలోని తన ఇంటి వద్ద నుంచి హరిచ్చంద్ర స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర జరిగింది. శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తదితరులు పాడె మోశారు. స్మశానవాటికలో సంప్రదాయం ప్రకారం దహన సంస్కారం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ అజేయ కల్లం, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, మాజీ జెఈవో శ్రీ శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది