శ్రీవారికి సంగీతార్చన

శ్రీవారికి సంగీతార్చన

తిరుపతి, సెప్టెంబరు 23, 2013: అక్టోబరు 5 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో కళాకారులు   స్వామివారికి సంగీతార్చన చేయనున్నారు. తిరుమలలో నాదనీరాజన మండపం, ఆస్థాన మండపం, తిరుపతిలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖ కళాకారుల సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా నిష్ణాతులైన వాయిద్య, నృత్య కళాకారులను ఆహ్వానిస్తారు. సంగీత కళాశాల విద్యార్థులకు ఈ కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయి. ఉద్ధండులైన కళాకారుల వాయిద్య, నృత్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఎంతో నేర్చుకునే అవకాశముంది. ఈ కార్యక్రమాలతో తిరుమల, తిరుపతిలో సైతం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. స్వామివారి ప్రాభవాన్ని భక్తులందరూ తెలుసుకునేందుకు ఈ సంగీత, నృత్య కార్యక్రమాలు దోహదపడతాయి.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది