శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం
తిరుమల, డిశెంబర్-17, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తోమాల, అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అయితే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. వైకుంఠద్వాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారు తిరువీధులలో ఊరేగుతారు. సాయంత్రం 5 గంటలకు రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ఆలయంలో అధ్యయనోత్సవం నిర్వహిస్తారు.
డిశెంబర్ 29వ తేదిన వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5 గంటలకు శ్రీవరాహస్వామి వారి ఆలయంనకు శ్రీ చక్రతాళ్వార్ ఊరేగింపు, చక్రస్నానం, సాయంత్రం 4.30 గంటలకు రంగనాయకుల మండపంనందు ద్వాదశి పురాణం ప్రవచనం, ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ఆధ్యయనోత్సవం నిర్వహిస్తారు.
ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి తెల్లవారు జామున తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠం ద్వారా తెరవబడి, తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసివేయబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమలయప్పస్వామి సర్వాభరణ భూషితుడై తిరుమల తిరువీధులలో ఊరేగింపబడిన తర్వాత ఆలయంలో వేదపండితుల వేదమంత్రోత్సవాల నడుమ అత్యంత భక్తి శ్రద్దలతో ఆస్థానం నిర్వహిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని ఆరోజు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దుచేస్తారు.
అదేవిధంగా తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలోను, శ్రీగోవిందరాజస్వామి ఆలయంలోను, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలోను, దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలోను వైకుంఠ ఏకాదశి ఆస్థానం ఘనంగా జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.