శ్రీవారి ఆలయంలో రేపు ఉగాది ఆస్థానం
శ్రీవారి ఆలయంలో రేపు ఉగాది ఆస్థానం
తిరుమల, 2010 మార్చి 15 : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 16వ తేదిన ఉగాది ఆస్థానం కన్నుల పండుగగా జరుగుతుంది.
ఈ సందర్భంగా మార్చి 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలైన తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధనసేవ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలు రద్దు చేశారు. అయితే సహస్రదీపాలంకారసేవను యధావిధిగా నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీవారి ఆలయంలో నిత్యోత్సవాలు మార్చి 16 నుండి ఏఫ్రల్ 24 వరకు ఘనంగా నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం తెలుగు ఉగాదినాడు తెలుగువారి ఇలవేలుపు అయిన శ్రీవేంకటేశ్వరస్వామికి ”ఉగాది ఆస్థానం” జరుగుతుంది. ఆరోజు ఉదయం మొదటి ఘంట నివేదనానంతరం శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలసి సర్వభూపాల వాహనంలో బంగారు వాకిలి ముందు వేంచేస్తారు. శ్రీవారి సేనాపతి శ్రీ విష్వక్సేనుల వారు పక్కన దక్షిణాభిముఖంగా మరొక పీఠంపై వేంచేస్తారు.
సర్వఅలంకరణాభూషితుడైన శ్రీవారికి ప్రసాదనివేదన అనంతరం, అక్షితారోపణ జరిగిన తర్వాత పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఆనాటి తిధి, వారి నక్షత్రాలతో పాటు సంవత్సర ఫలాలు, దేశకాల వ్యవహారాది పంచాంగ వివరాలను శ్రీనివాసునికి విన్పించడం జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.