శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరం

శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరం

తిరుపతి, జనవరి -05,2011 : నిత్యం సంగీత స్వర స్థానాల సమ్మేళనంతో ప్రతి ధ్వనించే శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంభరంలో మునిగి తేలుతుంది.

50 ఏళ్ళ క్రితం శ్రీవారి ఆశీస్సులతో, ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా తిరుపతిలో యస్‌.వి.సంగీత నృత్య కళాశాల రూపుదిద్దుకొంది. వివిధ దార్మిక సామాజిక కార్యక్రమాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సంగీతానికి ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తున్నది అనడానికి ఈ యస్‌.వి. సంగీత కళాశాలే ప్రతిరూపం.

 5 రోజుల ఈ స్వర్ణోత్సవాలలో భాగంగా మొదటి రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు స్థానిక కోదండస్వామి ఆలయం నుండి నగర పురవీధులగుండా నగర సంకీర్తన కన్నుల పండుగగా జరిగినది. అనంతరం కళాశాల ప్రాంగణంలో నిలువెత్తు శ్రీవారి విగ్రహం, వాగ్గేయకారులైన అన్నమయ్య, పురందరదాసు, భద్రాచల రామదాసు, త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వంటి ప్రపంచ వాగ్గేయకారుల విగ్రహాలను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి ఎన్‌.యువరాజు, పాలకమండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గార్ల చేతుల మీదుగా ప్రతిష్ఠింప చేసారు.

ఉదయం 10 గంటలకు కళాశాల ఆడిటోరియంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కళాశాల అధ్యాపకులు, స్థానికులచే శ్రీత్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల బృందగానం, డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.జానకీరామన్‌ గారిచే సంగీత ఉపన్యాసం జరిగింది. సాయంత్రం 4 గంటలకు వి.సత్యనారాయణ నాదస్వరం ప్రేక్షకులను కట్టిపడేసింది. 6.30 గంటలకు ప్రముఖ విద్వాంసులకు, కళాశాల రిటైర్డ్‌ లెక్సరర్స్‌కు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అదే విధంగా సాయంత్రం 7.30 గంటలకు ఎం. ఉమాముద్దుబాల నృత్య దర్శకత్వంలో 50 సంవత్సరాల కళాశాల యొక్క స్వర్ణోత్సవ వేడుకల నృత్యరూపకము ప్రేక్షకులను అలరించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.