శ్రీశైలం ఆలయగోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తి : ఈఓ
శ్రీశైలం ఆలయగోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తి : ఈఓ
తిరుపతి, 2012 సెప్టెంబరు 15: తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆలయ గోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తయినట్టు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. తితిదే జ్యువెలరీ విభాగంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈవో బంగారు తాపడానికి ఉపయోగించే రేకులను శ్రీశైలం ఆలయ బోర్డు అధ్యకక్షులు శ్రీ ఐ.కోటేశ్వరరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయాలకు బంగారు తాపడం పనులు చేయడంలో తితిదే అపూర్వమైన అనుభవం గడించిందన్నారు. జ్యువెలరీ విభాగం అధికారులు, సిబ్బంది శ్రమించి సకాలంలో పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని ఆలయాలకు ఇలాంటి బంగారు తాపడం పనులు చేసేందుకు తితిదే సిద్ధంగా ఉందని వివరించారు. శ్రీశైలం నుండి శేషాచలం కొండలు ప్రారంభమవుతాయని, ఆ రకంగా భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంతో తితిదేకి అనుబంధం ఉందని తెలిపారు.
శ్రీశైలం ఆలయ బోర్డు అధ్యకక్షులు శ్రీ ఐ.కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో మల్లికార్జునస్వామివారి ఆలయ గోపురం బంగారు తాపడం పనులను తితిదే చక్కగా చేసినట్టు గుర్తు చేశారు. దసరా పర్వదినంలోపు భ్రమరాంబికా అమ్మవారి ఆలయ గోపురానికి ఈ రేకులతో బంగారు తాపడం పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, జ్యువెలరీ విభాగం సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో తితిదే జ్యువెలరీ విభాగం అధికారులు, శ్రీశైలం ఆలయ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.