COMMITTEE VISITS MANGAPURAM TEMPLE _ శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని సందర్శించిన స్థానిక ఆలయాల అభివృద్ధి కమిటీ
శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని సందర్శించిన స్థానిక ఆలయాల అభివృద్ధి కమిటీ
తిరుపతి, ఆగస్టు 08, 2013: స్థానిక ఆలయాల అభివృద్ధి కోసం తితిదే ధర్మకర్తల మండలి ఏర్పాటుచేసిన స్థానిక ఆలయాల అభివృద్ధి కమిటీ గురువారం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సందర్శించింది. ఆలయ అభివృద్ధి కోసం పలు సూచనలు చేసింది.
ఆలయంలో ప్రసాదాలు తయారుచేసే పోటును విస్తరించాలని, కల్యాణోత్సవ మండపాన్ని ఆధునీకరించాలని, తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఇక్కడ కూడా సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు ప్రవేశపెట్టాలని సూచించింది. స్థానిక ఆలయాలు, తిరుమల శ్రీవారి ఆలయంలోని సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాటి కేటాయింపు మరింత పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడింది. స్వామివారి వాహనాలన్నింటినీ అటవీ విభాగం ద్వారా కొనుగోలు చేయాలని, ఆర్కియాలజి శాఖ సహకారంతో ఆలయంలో చేపట్టనున్న మాస్టర్‌ప్లాన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేందుకు కృషి చేయాలని భావించింది. ఆలయం ముందు గల జనరేటర్‌ను మరింత దూరంగా పెట్టాలని, పుష్కరిణి పనులను వేగవంతం చేయాలని, ఆలయ మాడ వీధులను వెడల్పు చేయాలని, ఉత్సవాలు జరిగే సమయంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ జి.వి.శ్రీనాథరెడ్డి, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, అదనపు ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి శ్రీ ఓ.బాలాజీ, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.