శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లలో స్వల్పమార్పులు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లలో స్వల్పమార్పులు
తిరుపతి, ఆగస్టు 06, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవా టికెట్లలో తితిదే స్వల్పమార్పులు చేపట్టింది. ఈ మార్పులు నేటి నుండి అందుబాటులోకి రానున్నాయి.
రోజువారీ సేవల్లో రూ.500/- విలువ గల పద్మావతి పరిణయోత్సవం(కల్యాణోత్సవం) ఆర్జిత సేవకు ఇదివరకు ఐదుగురిని అనుమతిస్తుండగా ఇప్పటినుండి ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ మరియు అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. రూ.116/- విలువైన ఊంజల్‌సేవ టికెట్ కొనుగోలు చేస్తే ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. వేదాశీర్వచనం సేవను కొత్తగా రోజువారీ సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- విలువైన ఈ టికెట్ కొనుగోలు చేస్తే ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ మరియు వడ బహుమానంగా అందజేస్తారు.
వారపు సేవల్లో ప్రతి సోమవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవకు రూ.300/- టికెట్ ధరగా నిర్ణయించారు. ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి ఒక లడ్డూ, ఒక వడ మరియు క్యారీబ్యాగ్ బహుమానంగా అందిస్తారు. ప్రతి మంగళవారం నిర్వహించే తిరుప్పావడ సేవకు రూ.600/- టికెట్ ధరగా నిర్ణయించారు. ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి ఒక లడ్డూ, ఒక వడ, ఒక అప్పం, ఒక జిలేబి, ఒక తెంతొల, ఒక క్యారీబ్యాగ్ బహుమానంగా అందజేస్తారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వస్త్రాలంకార సేవ టికెట్ ధర రూ.10,000/- కాగా ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఒక పట్టు సరిగ దుపట్టా, ఒక రవికె, రెండు లడ్డూలు మరియు రెండు వడలు బహుమానంగా అందిస్తారు. ప్రతి శుక్రవారం నిర్వహించే రూ.400/- విలువైన అభిషేకం టికెట్‌పై ఒకరిని అనుమతిస్తూ ఒక లడ్డూ బహుమానంగా అందజేస్తారు. అలాగే ప్రతి శుక్రవారం చేసే రూ.116/- లక్ష్మీపూజ టికెట్‌పై ఒకరిని అనుమతిస్తూ ఒక రవికె బహుమానంగా అందిస్తారు. ప్రతి శనివారం నిర్వహించే పుష్పాంజలి సేవ టికెట్‌ను రూ.300/-గా నిర్ణయించారు. ఒకరిని మాత్రమే అనుమతిస్తూ ఒక లడ్డూ, ఒక వడ మరియు ఒక క్యారీబ్యాగ్‌ను బహుమానంగా అందజేస్తారు. ప్రతి శుక్రవారం నిర్వహించే సహస్రదీపాలంకార సేవ టికెట్ ధరను రూ.100/- నిర్ణయించారు. ఒకరిని మాత్రమే అనుమతిస్తూ ఒక లడ్డూ, ఒక వడ మరియు ఒక క్యారీబ్యాగ్‌ను బహుమానంగా అందిస్తారు.
నెలవారీ సేవల్లో ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించే అష్టోత్తర శతకలశాభిషేకం సేవా టికెట్ ధర రూ.1000/- నిర్ణయించారు. ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి రెండు లడ్డూలు, రెండు వడలు, ఒక క్యారీబ్యాగ్‌ను బహుమానంగా అందజేస్తారు.
వార్షిక సేవల్లో ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించే వసంతోత్సవం సేవా టికెట్ ధరను ఒక్కొక్కరికి రూ.150/- నిర్ణయించారు. వీరికి ఒక లడ్డూ, ఒక వడ మరియు క్యారీబ్యాగ్ బహుమానంగా అందిస్తారు. సెప్టెంబరులో జరిగే పవిత్రోత్సవం సేవా టికెట్ ధరను ఒక్కొక్కరికి రూ.750/-గా నిర్ణయించారు. వీరికి రెండు లడ్డూలు, రెండు వడలు మరియు క్యారీబ్యాగ్‌ను బహుమానంగా అందజేస్తారు. నవంబరులో జరిగే రూ.1116/- విలువైన లక్షకుంకుమార్చన సేవా టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు మరియు క్యారీబ్యాగ్ బహుమానంగా అందిస్తారు. పంచమీతీర్థం మరుసటి రోజు జరిగే రూ.500/- విలువైన పుష్పయాగం ఆర్జిత సేవకు ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి రెండు లడ్డూలు, రెండు వడలు మరియు క్యారీబ్యాగ్ బహుమానంగా అందజేస్తారు. రూ.500/- విలువ గల వరలక్ష్మీవ్రతం ఆర్జిత సేవకు ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు, ఒక క్యారీబ్యాగ్ బహుమానంగా అందిస్తారు. ఆర్జిత సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు 30 రోజులు ముందుగా కార్యనిర్వహణాధికారి పేరు మీద డి.డి తీసి ”ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. తితిదే ఈ-దర్శన్ కౌంటర్లలోనూ సేవా టికెట్లు పొందొచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.