సకలజగద్రక్షకుడు సూర్యభగవానుడు – తితిదే ఇఓ 

సకలజగద్రక్షకుడు సూర్యభగవానుడు – తితిదే ఇఓ
 
తిరుమల, 17 ఫిబ్రవరి – 2013: సకల జీవకోటికి తన తేజోమయమైన కాంతి కిరణాలతో జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యుడు సర్వజగద్రక్షకుడని తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం అన్నారు.
 
రథసప్తమి సందర్భంగా ఆయన విలేకరులతో తిరుమలలో ఆదివారంనాడు వాహనమండపం దగ్గర మాట్లాడుతూ ఈ పర్వదినంనాడు ఒకేరోజు శ్రీమలయప్పస్వామివారు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆ స్వామి సుమనోహరరూపాన్ని కనులారా సందర్శించడానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేయడం ఆనందదాయకమన్నారు. ఇది బ్రహ్మోత్సవ వైభవాన్ని తలపిస్తున్నదన్నారు.
కాగా సూర్యజయంతి సందర్భంగా తొలివాహనమైన సూర్యప్రభవాహనంపై శ్రీమలయప్పస్వామి సూర్యనారాయణ మూర్తిగా ప్రకాశిస్తూ భక్తులను పరవశుల్నిచేశాడు. అనంతరం చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభవాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించాడు. కాగా మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల నడుమ స్వామి పుష్కరిణిలో జరిగిన చక్రస్నానంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.