ANJANEYA SWAMY UPASANA IS THE ULTIMATE WAY FOR HAPPINESS _ సకల శుభాలకు మూలం శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన : శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ

TIRUMALA, 03 JUNE 2024: The sincere and dedicated worship of Sri Anjaneya Swamy is the ultimate way to lead a peaceful and happy life advocated Sri Swaswarupanandagiri Swamiji of Sri Lalita Peetham.

During his religious discourse on Nada Neerajanam platform on Monday evening he said Lord Hanuman is the boon giver of good health, wealth, knowledge and power. And appreciated TTD for organising five-day Hanuman Jayanti festivities.

Special Officer Dr Vibhishana Sharma was also present.

Devotional cultural programs were observed at Akasaganga and Japalitheertham by various artists of different projects of TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

సకల శుభాలకు మూలం శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన : శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ

– భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమ‌ల‌, 2024 జూన్ 03: సకల దేవతల ఆరాధనకు హనుమంతుని ఆశ్రయించడం ఒక్కటే మార్గమని, తద్వారా సకల శుభాలు చేకూరుతాయని శ్రీనివాసమంగాపురం శ్రీ వశిష్టాశ్రమ శ్రీ లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ ఉద్ఘాటించారు.

హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

నాదనీరాజనం వేదికపై….

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, కర్మ, భక్తి, జ్ఞాన యోగాల ద్వారా ఆంజనేయస్వామి యుగయుగాలకు ఆదర్శప్రాయం అన్నారు. హనుమంతుని అపారమైన భక్తి, కార్యదీక్ష, ధైర్య సాహసాలతో భక్తలోకానికి ఆరోగ్య ప్రదాతగా మారారని తెలియజేశారు.రామ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారందరినీ హనుమంతుడు అనుగ్రహిస్తారని, తులసీదాసు తదితర మహనీయుల చరిత్రను వివరించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నందుకు టీటీడీని స్వామీజీ అభినందించారు.

అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.

ఆకాశగంగలో…..

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉదయం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం అధ్యాప‌కులు ఆచార్య రాఘ‌వాచార్యులు హ‌నుమంతుని జ‌న్మ విశేషాలు తెలిపారు.

జాపాలి క్షేత్రంలో….

జాపాలి క్షేత్రంలో ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఉద‌య్ భాస్క‌ర్‌ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కురాలు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ” ఎందరో మహానుభావులు…, శ్రీ ఆంజనేయ జగదేక వీర…., బంటు రీతి కొలువు ఈయవయ్య రామా….శ్రీ హ‌నుమ జ‌య హ‌నుమ‌…., ” త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను సుమ‌ధురంగా ఆల‌పించారు.

అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ప్ర‌స‌న్న ల‌క్ష్మీ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీమతి ల‌లిత శివ జ్యోతి బృందం గాత్ర సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.