VENGAMAMBA LITERARY FETE CONCLUDES _ సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : శ‌తావ‌ధాని శ్రీ ఆముదాల ముర‌ళి

VENGAMAMBA LITERARY FETE CONCLUDES

TIRUPATI, 22 MAY 2024: The two-day literary fete on Matrusri Tarigonda Vengamamba on the occasion of her 294th Birth Anniversary in Annamacharya Kalamandiram in Tirupati on Wednesday evening.

Renowned scholars Sri Amudala Murali, Dr VR Rasani, Dr Keshavulu, Sri Balaji Deekshitulu spoke on various subjects including on her life, on her philosophy, great works etc.

Later in the evening devotional cultural programmes by artists of the Annamacharya Project, students of SV College of Music and Dance were performed which allured the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : శ‌తావ‌ధాని శ్రీ ఆముదాల ముర‌ళి

– తిరుపతిలో ముగిసిన తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2024 మే 22: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని తిరుప‌తికి చెందిన శ‌తావ‌ధాని శ్రీ ఆముదాల ముర‌ళి పేర్కొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జ‌యంతి ఉత్సవాలు బుధ‌వారం ఘ‌నంగా ముగిశాయి.

ఈ సంద‌ర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ ఆముదాల ముర‌ళి ఉపన్యసిస్తూ, వెంగమాంబ రచనలు నాటి సమాజంలోని రుగ్మతలను ప్రశ్నిస్తూ, నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు.

డా.వి.ఆర్‌. రాసాని ” మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – జీవిత విశేషాలు ” అనే అంశంపై మాట్లాడుతూ, వెంగమాంబ బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్నా, వైదవ్యాన్ని అంగీకరించలేదని దీనికి కారణం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తన భర్తగా భావించిందని తెలిపారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని చెప్పారు.

వేటూరి ప్రభాకర శాస్త్రి వాజ్మ‌య పీఠం సహాయ పరిశోధకులు డాక్టర్ కేశవులు ” మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సాహిత్యం, వర్ణనలు ” అనే అంశంపై మాట్లాడుతూ, ఆమె వివిధ సాహిత్య ప్రక్రియలలో 18 గ్రంథాలను రచించిన మొదటి తెలుగు కవయత్రి అని తెలిపారు. రచనలలో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు చెప్పారు. ప్రాచీన కవులకు దీటుగా, ప్రబంధాలకు పోటీగా తరిగొండ వెంగమాంబ అష్టాదశ వర్ణ‌న‌లు చేశారని సోదాహరణంగా వివరించారు.

తిరుప‌తికి చెందిన డా. బాలాజీ దీక్షితులు ” మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – తెలుగు సాహిత్య సౌరభం ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, తరిగొండ వెంగమాంబ కవిత మాధుర్యం వర్ణ‌న‌ అలవి కాదన్నారు. ఆమె ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసిన అటవీ మార్గం నేటికీ యోగ సాధన రహస్యాలు తెలిపే మార్గమని వివ‌రించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.