సెప్టంబర్‌ 15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం 

సెప్టంబర్‌ 15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం

తిరుమల, ఆగష్టు -28,  2009: శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్‌ 15వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టదళపాదపద్మారాధనసేవను రద్దు చేశారు.

సంక్షిప్తసమాచారంః

కోయిల్‌ అనగా గుడి. ఆళ్వారు భగవంతునితో తాదాత్మ్యం పొందిన భక్తుడు. దేవాలయాన్ని మానవాకారంతో పోలుస్తారు. నిరంతరం నిరంతరాయంగా స్వామిని స్వామివైభవాన్ని దర్శించి, అనుభవించిన కోవెలను కూడా ఆళ్వార్‌గా భావించడం అనే సంప్రదాయం ఇక్కడ మనకు కనపడుతోంది. అందుకే కోయిల్‌ ఆళ్వార్‌ అని గుడిని పిలవడం.

తిరుమజ్జనమే తిరుమంజనం అయింది. తిరువ శ్రీ, మజ్జనం అనగా స్నానం-మగళస్నానం. శుద్ధిచేయడం అన్నమాట. తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు,  వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం జరుగుతుంది. ఇదొక మహాయజ్ఞంగా జరుగుతుంది.

గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలు, బంగారు వెండి పాత్రలు బంగారు వాకిలి వరకు తెస్తారు. లోపల గోడలు పైకప్పులు ఇలా అంతటా కడిగి శుభ్రంచేస్తారు. ఇలా చుట్టు గుళ్లు కూడా శుభ్రం చేస్తారు.

పిదప ‘పరిమళాన్ని’ ఆలయంలో గోడలకు పూస్తారు. నామంకోపు, శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, ఖిచిలి గడ ్డ- వీటి మిశ్రమమే ‘పరిమళం’ అంటారు. ఈ పరిమళపు లేహ్యాన్ని అంతటా పూస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.