సెప్టెంబరు 10 నుండి 17వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గోవిందకల్యాణాలు
సెప్టెంబరు 10 నుండి 17వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గోవిందకల్యాణాలు
తిరుపతి, 2012 సెప్టెంబరు 1: తి.తి.దే కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబరు 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలోని ఆరు ఏజెన్సీ ప్రాంతాల్లో గోవింద కల్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తి.తి.దే రాష్ట్రంలోనే గాక దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 10వ తేదీన సంతకవిటి మండలంలోని మామిడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, సెప్టెంబర్ 12వ తేదీన సీతంపేట మండలంలోని ధన్బాయి గ్రామంలో, సెప్టెంబర్ 13వ తేదీన బామిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోవింద కల్యాణాలను కన్నులపండువగా నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 15వ తేదీన పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న అగ్రికల్చరల్ మార్కెట్లో, సెప్టెంబర్ 16వ తేదీన కొత్తూరు మండలంలోని నిపాగం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, సెప్టెంబర్ 17వ తేదీన జి.సింగడం మండలంలోని సతవిరుటి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోవింద కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.రామక్రిష్ణ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.