సెప్టెంబరు 27 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 27 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 సెప్టెంబరు 3: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 26వ తేదీన అంకురార్పణం జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 27వ తేదీన పవిత్రప్రతిష్ఠ, 28వ తేదీన పవిత్ర సమర్పణ, 29వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.1500/- చెల్లించి ఐదుగురు గృహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 5 గ్రాముల వెండి డాలర్‌, ఒక ఉత్తరీయం, ఒక రవికె, 5 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం మరియు ఊంజల్‌సేవ, తిరుప్పావడ సేవ, లక్ష్మీపూజ, పుష్పాంజలి ఆర్జిత సేవలను రద్దు చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.