స్కాలర్‌షిప్‌లపై ఆందోళన వద్దు – తితిదే విద్యార్థులకు జెఈఓ భరోసా
స్కాలర్‌షిప్‌లపై ఆందోళన వద్దు – తితిదే విద్యార్థులకు జెఈఓ భరోసా
తిరుపతి, 2012 ఆగస్టు 6: తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అందవలసిన మెస్ ట్యూషన్ ఫీజు(స్కాలర్‌షిప్) విషయమై ఆందోళన చెందవలసిన అవసరం లేదని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
తితిదేలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లను వెనక్కు పంపినట్లు అపోహలతో కూడిన ఆందోళనలు చేయటం సరికాదని ఆయన అన్నారు. వాస్తవానికి తితిదే విద్యాసంస్థల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీ విద్యార్థులకు అందుతున్న స్కాలర్‌షిప్ విషయమై స్టేట్ ఆడిట్ వారు ఇదివరకే విద్యార్థిని విద్యార్థులకు భోజన సౌకర్యం ఉచితంగా అందిస్తున్నందున అందుకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు(మెస్ ట్యూషన్ ఫీజు) ఇవ్వడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించడం జరిగింది. ఇందుకు సంబంధించి తితిదే ప్రభుత్వానికి సరియైన సమాచారాన్ని అందించాల్సిందిగా కోరడమైనది. అయితే ప్రభుత్వం నుండి ఇంకనూ సంబంధిత సమాచారం అందవలసి ఉంది. తితిదే విద్యార్థిని విద్యార్థుల పట్ల పూర్తిస్థాయి సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తుందని, కనుక విద్యార్థిని విద్యార్థులు ఈ విషయమై అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.