స్థానికాలయాలలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
స్థానికాలయాలలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
తిరుపతి, ఏప్రిల్-8, 2009: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర స్థానికాలయాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి డా||కె.వి.రమణాచారి చెప్పారు. బుధవారం ఉదయం తితిదే పరిపాలనా భవనంలో జరిగిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావాన్ని, భజన సంస్కృతిని పెంపొందించేందుకు గాను భజనమండలి సమావేశాల్ని మహబూబ్‌నగర్‌లో ఏఫ్రిల్ 26న, కర్నూలు, కడపలలో ఏఫ్రిల్ 27న, కృష్ణాజిల్లాలో మే 19వ తేదిన, ఉభయగోదావరిజిల్లాలలో మే 20వ తేదిన నిర్వహించాలని ఆయన హిందూ ధర్మప్రచారపరిషత్ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా తితిదే వెబ్‌సైట్‌ను అధికారుల నుండి సరియైన సమాచారాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచాల్సిందిగా ఆయన ఇ.డి.పి. మేనేజర్‌ను ఆదేశించారు.
తితిదేలో పనిచేసి పదవీ విరమణచేసే ప్రతి ఉద్యోగికి అతను పదవి విరమణ చేసేనాటికి వారికి అందాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను అదేరోజున అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన గణాంక శాఖాధికారిని ఆదేశించారు.
తితిదే విద్యాసంస్థలలోని హాస్టల్లలో అవసరమైన వంట పాత్రలను సమకూర్చాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. తిరుమల, తిరుపతిలలో ప్రధాన కూడళ్ళలో అవసరమైన సూచిక బోర్డులను తయారుచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అదే విధంగా గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు పాదాలమండపంకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో తితిదే ముఖ్యభద్రతాధికారి శ్రీపి.వి.ఎస్.రామకృష్ణ, ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఇ.ఓ.లు శ్రీ ఆర్.ప్రభాకర్ రెడ్డి, శ్రీ టి.ఏ.పి.నారాయణ, శ్రీ శ్రీధర్, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.