SRINIVASA SHINES ON RAYANCHA _ హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
TIRUPATI, 12 FEBRUARY 2023:Kalyana Venkateswara shines on Hamsa Vahanam on Sunday evening on the second day evening as part of ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram.
As the Goddess of Wisdom in Saraswati Devi Alankaram, the Lord blessed His devotees.
హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి, 2023 ఫిబ్రవరి 12: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, కంకణ భట్టార్ శ్రీ బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.