హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కటాక్షం
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కటాక్షం
తిరుపతి, 2022 జూన్ 11: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీ రూపంతో అనుగ్రహించారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమ జ్ఞానానికి హంస సంకేతం. హంస సరస్వతి అమ్మవారికి వాహనం. కనుక స్వామివారు సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞాన విజ్ఞాన చైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మల మనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.