అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01వ తేదీ వరకు న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01వ తేదీ వరకు న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి / న్యూఢిల్లీ, 2026, అక్టోబర్ 24: న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 01వ తేదీ వరకు   వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణ  కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం; 31న పవిత్ర సమర్పణ; నవంబర్ 01న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం నాలుగు మాడ వీధులలో స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల విశిష్టత

ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి జారీ చేసినది.