అన్నమాచార్య కళామందిరంలో ఆచార్య పురుషుల తిరునక్షోత్స్రవాలు ప్రారంభం

అన్నమాచార్య కళామందిరంలో ఆచార్య పురుషుల తిరునక్షోత్స్రవాలు ప్రారంభం

తిరుపతి, 2012 సెప్టెంబరు 6: తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఆచార్యపురుషుల అవతార తిరునక్షోత్స్రవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ పండితుల ఉపన్యాస కార్యక్రమాలు, సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.

శ్రీకృష్ణ పెరియవాచ్చాన్‌పిళ్లై, శ్రీ నయనరాచాన్‌ పిళ్లై, తిరుకురుకై పిరాన్‌ పిళ్లాన్‌ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల శ్రీవారిని తమ పాసురాల ద్వారా కీర్తించారు. అలాగే ఆళ్వార్లు రాసిన దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రాసి ఆచార్య పురుషులుగా వినుతికెక్కారు. వీరి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉపన్యాస కార్యక్రమాలు జరుగనున్నాయి. గురువారం సాయంత్రం ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ వి.జి.చొక్కలింగం ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మొదటిరోజు తిరుపతికి చెందిన శ్రీ ఇ.జి.హేమంతకుమార్‌ ‘శ్రీకృష్ణతత్వం’ అనే అంశంపై ఉపన్యసించనున్నారు. అలాగే తిరుపతికి చెందిన శ్రీమతి జి.వి.రాజ్యలక్ష్మి ‘పెరియవాచ్చాన్‌పిళ్లై వైభవం’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత సభ నిర్వహించనున్నారు.

అలాగే సెప్టెంబరు 7వ తేదీన తిరుపతికి చెందిన శ్రీ వి.గోపాలకృష్ణమూర్తి ‘భగవద్గీత’, తిరుపతికి చెందిన ఆచార్య జయప్రకాష్‌ నారాయణ ‘పెరియవాచ్చాన్‌పిళ్లై తిరుప్పావై వ్యాఖ్యానము’ అనే అంశాలపై ఉపన్యసించనున్నారు. సెప్టెంబరు 8న తిరుపతికి చెందిన శ్రీ వరదరామానుజాచార్యులు ‘పెరియవాచ్చాన్‌పిళ్లై మరియు తిరుమల’, తిరుపతికి చెందిన శ్రీ పి.ఆర్‌.రంగరాజన్‌ ‘నయనరాచాన్‌పిళ్లై వైభవం’ అంశాలపై ప్రసంగించనున్నారు. అదేవిధంగా సెప్టెంబరు 9వ తేదీన తిరుపతికి చెందిన శ్రీ సి.రంగనాధన్‌ ‘తిరుకురుకై పిరాన్‌పిళ్లాన్‌ వైభవము’, తిరుపతికి చెందిన శ్రీ పి.టి.జి.వై.సంపత్‌కుమారాచార్యులు ‘రామానుజాచార్యులు – తిరుకురుకై పిరాన్‌ పిళ్లాన్‌’ అనే అంశాలపై ఉపన్యసించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.