అన్నమాచార్య 508వ వర్థంతి మహోత్సవాల సందర్భంగా మెట్లోత్సవం 

అన్నమాచార్య 508వ వర్థంతి మహోత్సవాల సందర్భంగా మెట్లోత్సవం

తిరుపతి, మార్చి-30, 2011: తాళ్ళపాక అన్నమాచార్యులవారు పరమభక్త శిఖామణి, మహాపండితుడు, సంగీత, సాహిత్యములు రెండింటను ఔన్నత్యాన్ని సంపాదించి ఆరెండును శ్రీ వేంకటేశ్వరస్వామికి సమర్పించి ధన్యుడైనాడని అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డా. మేడసాని మోహన్‌ అన్నారు. బుధవారం ఉదయం అలిపిరి వద్ద అన్నమాచార్య 508వ వర్థంతి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మెట్లోత్సవం కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా డా. మేడసాని మోహన్‌ మాట్లాడుతూ భగవద్రామానుజాచార్యులు ప్రతిపాదించిన ప్రవత్తి మార్గాన్ని అన్నమాచార్యుడు ప్రజానీకానికి ఎలుగెత్తి ప్రబోధించాడని, ఆయన ఆధ్యాత్మిక కీర్తనలలో పదే పదే శరణాగతి తత్త్వమే గోచరిస్తుందని తెలిపిన మహనీయుడు అన్నమయ్య అని తెలిపారు. అంతేగాక తన రచనలు భగవత్పాదాలకు తాను చేసిన పూజలని, అవి భగవంతుని కీర్తిరూప పుష్పాలని అన్నమయ్య పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

మెట్లోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుండి దాదాపు 1500 మంది భజన మండళ్ళు, అన్నమయ్య శరణాగతి మండళ్ళుపెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీరంతా పవిత్రమైన మెట్లకు పూజలు చేస్తూ, గోవిందనామస్మరణలతో తిరుమలకు చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డా. కొరాడ రామకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.