ఆకాశ‌గంగ‌, జాపాలిలో కొన‌సాగుతున్న ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

ఆకాశ‌గంగ‌, జాపాలిలో కొన‌సాగుతున్న ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమ‌ల‌, 2022 మే 28: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా శ‌నివారం ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు “జ్ఞానినామ‌గ్ర‌గ‌ణ్యం” అనే అంశంపై  జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి ఉప‌న్య‌సించారు.

ఆకాశ‌గంగలో ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు  ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్టంపై ఉప‌న్య‌సించారు. ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ ర‌ఘునాథ్‌ బృందం శ్రీ హ‌నుమాన్ చాలీసా, శ్రీ‌రామ, శ్రీ హ‌నుమ సంకీర్త‌న‌లు ఆల‌పించారు. మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ శ‌బ‌రిగిరీష్‌ ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లను ముగ్ధ‌మ‌నోహ‌రంగా గానం చేశారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు శ్రీ చంద్ర‌శేఖ‌ర భాగ‌వ‌తార్ హ‌రిక‌థ వినిపించారు. మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు దాస సాహిత్య ప్రాజెక్టు భ‌జ‌న బృందం క‌ళాకారులు హ‌నుమంతుని వైభ‌వంపై సంకీర్త‌న‌లు గానం చేశారు. ప్రోగ్రాం అసిస్టెంట్‌ శ్రీ పురుషోత్తం ఈ కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు భ‌జ‌న బృందం క‌ళాకారులు హ‌నుమంతుని వైభ‌వంపై సంకీర్త‌న‌లు గానం చేశారు. ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ చంద్ర‌శేఖ‌ర భాగ‌వ‌తార్ హ‌రిక‌థ వినిపించారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ ర‌ఘునాథ్‌ బృందం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల‌ వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ శ‌బ‌రిగిరీష్ బృందం ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

మే 29వ తేదీ ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.