ఏప్రిల్‌ 25న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

ఏప్రిల్‌ 25న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

ఏప్రిల్‌ 25వ తేదీన చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజ స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరుగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌ తదితర తొమ్మిది మంది దేవేరులు ఉదయం 3.00 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.
అనంతరం అక్కడ ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారు వాహన మండపానికి వేంచేస్తారు. అక్కడ సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.

గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడినుండి గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.