కల్పవృక్ష వాహనంపై గోవిందరాజస్వామి వైభవం

కల్పవృక్ష వాహనంపై గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి, మే  20, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా అవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు ఈడర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని ఆధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు.
అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు  స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు సర్వభూపాల  వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంత విశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెదజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం మహతి కళాక్షేత్రంలో శ్రీ కందాడి రామానుజాచార్య ధార్మికోపన్యాసం, శ్రీ చిదంబరశాస్త్రి ధార్మికోపన్యాసం, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద శ్రీమతి ఎస్‌.మణి సంగీత కచేరి, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రి హరికథా కాలక్షేపం ఏర్పాటుచేశారు.
మే 21న గరుడసేవ:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 8.00 గంటల నుండి 10.30 గంటల వరకు గరుడ సేవ వైభవంగా జరుగనుంది.
   –
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.