TTD WILL SUPPORT FARMERS TAKING UP “GO ADHARITA” AGRICULTURE _ గో ఆధారిత వ్య‌వ‌సాయ రైతుల‌కు టిటిడి అండ‌ – ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

IF U SAVE GOMATA – BHUMATA WILL SAVE US- TTD CHAIRMAN

 

FUTURE LIES ON GO ADHARITA VYAVASAYAM – TTD EO

 

TIRUPATI, 30 OCTOBER 2021: Come up with Go Adharita Farming and TTD will support you in your move, said TTD Chairman Sri YV Subba Reddy.

 

Speaking on the inaugural session of the today ‘Go Maha Sammelan’ held at Mahathi Auditorium on Saturday under the aegis of Tirumala Tirupati Devasthanams he said TTD will offer help to the products produced by the farmers using this technique. The aim of this two-day Seminar is to bring awareness among the farmers on the importance of Go Adharita agriculture, Natural farming techniques etc.

 

He said under the directives of Andhra Pradesh Chief Minister Sri YS Jaganmohan Reddy, TTD has taken up Go Samrakshana programs and to protect the bovines as a national asset for the future generations.

 

“Apart from dharmic and social services,  we have taken up the campaign for Go Samrakshana in a big way in the recent times which included Gudiko Go Mata, Navaneeta Seva, Go-based Naivedyam to Srivaru, production of Panchagavya products, MOU with SV Veterinary University for quality cows and organic farming in TTD lands etc”.

 

He called upon all the farmers who gathered from two Telugu states for the session to go for the ancient farming and dairy techniques and take up the task of saving Desi Cows as a Maha Yagna.

 

Earlier, TTD EO Dr KS Jawahar Reddy in his speech said that TTD has launched several initiatives and entered MoU with AP Rythu Sadhikara Samstha and the Environment Farming Department for spreading awareness on the advantages of organic farming and promotion of desi breed of Cows in the state.

 

He said TTD has set up a state of art Gosala at Palamner spread in over 450 acres of land, rearing 1000 Ongole breed cows and bulls.  The Honourable AP CM had also inaugurated the Go Mandiram at Alipiri to facilitate devotees with Go puja, Saptha Go Pradakshinashala, Go Tulabharam, Go Vijnan Kendram and Go Sadan.

         

The EO also quoted the examples of how two families survived the Bhopal Gas Tragedy by performing Yagam with Panchagavya. He also presented an impressive PPP on TTD Gosamrakshana activities.

 

In her Anugraha Bhashanam, Mata Nirmalananda Bharati from Hyderabad callee everyone to take a pledge to Save the Cow and develop Go Adharita Vyavasayam as their life goals.

 

Later a book, Go Mahatyam compiled by Dr A Vibhishana Sharma was released on the occasion l.

 

Board members Sri M Srinivasulu, Sri P Ashok Kumar, Sri T Maruti Prasad also spoke on the occasion.

 

JEOs Sri Veerabrahmaiah, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Yuga Tulasi Foundation Founder Sri Siva Kumar, SEVA organization founder Sri Vijayaram, HDPP Chief Sri Rama Rao and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో ఆధారిత వ్య‌వ‌సాయ రైతుల‌కు టిటిడి అండ‌

– ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధ‌ర చెల్లింపు

– నేల‌త‌ల్లిని ర‌క్షించ‌డానికే జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం

– జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం ప్రారంభోత్స‌వంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– ప్రపంచ భవిష్యత్తుకు గో ఆధారిత వ్యవసాయ‌మే దిక్కు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 30 అక్టోబరు 2021: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసే రైతులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుంద‌ని, వారు పండించిన ఉత్ప‌త్తుల‌ను గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి కొనుగోలు చేస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. నేల‌త‌ల్లిని కాపాడి ప్ర‌పంచానికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అందించే దిశ‌గా రైతుల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతోనే జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం శ‌నివారం వేడుక‌గా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిద‌ని చెప్పారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవార‌ని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవార‌ని అన్నారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవ‌ని, వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌ని చెప్పారు. యజ్ఞయాగాదులు, హోమాల్లో గోవు పిడకలు, నెయ్యి ఎంతో ప్రాముఖ్యమైనవ‌ని, నేటి ఆధునిక సమాజంలో కూడా గృహప్రవేశాలు, ఆల‌య కుంభాభిషేకాలు ఇతర శుభకార్యాల్లో ముందుగా గోవును ప్ర‌వేశ‌పెట్టే సంప్ర‌దాయం న‌డుస్తోంద‌న్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఓ వైపు పెద్ద ఎత్తున సనాతన హిందూ ధర్మప్రచారం చేస్తూనే, మరోవైపు గోసంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గోవును జాతీయప్రాణిగా గుర్తించాల‌ని త‌మ‌ ధర్మకర్తల మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింద‌న్నారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గోసంరక్షణ కోసం కట్టుబడి ఉన్నార‌ని, ఇందులోభాగంగా గత ఏడాది గుంటూరు జిల్లా నరస‌రావుపేటలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ఆయన స్వయంగా పాల్గొన్నార‌ని అన్నారు.

గుడికో గోమాత

– ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో హిందూ ధ‌ర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌న్నారు. ద‌క్షిణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీతో క‌లిపి 74 ఆలయాల్లో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో ఈ సంఖ్య‌ను 100 ఆల‌యాల‌కు పెంచ‌డానికి ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంద‌ని, గోవుల పోష‌ణ విష‌యంలో ఇబ్బందులు ఎదురైనా టిటిడి ఆదుకోవ‌డానికి సిద్ధంగా ఉంద‌ని వివ‌రించారు.

స్థానికాలయాల్లో గోపూజ

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకపిలేశ్వరాల‌యం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేశామ‌న్నారు.

గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం

– తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి పూర్వం గో ఆధారిత ప్ర‌కృతి వ్యవసాయ ఉత్పత్తులతో ప్రతిరోజూ నైవేద్యం సమర్పించేవాని, కాలక్రమంలో ఈ పద్ధతిలో మార్పులు చోటు చేసుకుని రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తులతో స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ వచ్చార‌ని చెప్పారు. త‌మ‌ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ స్వామివారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను ఈ ఏడాది మే 1వ తేదీ నుండి నిత్య నైవేద్యంగా సమర్పిస్తున్నామ‌ని తెలిపారు. శ్రీనివాసుని కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమం నిరంత‌రాయంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. భార‌త‌దేశంలో ర‌సాయ‌న ఎరువుల‌తో త‌యారుచేసిన‌ దాణా తినే ఆవుల పాల వ‌ల్ల మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్ పెరుగుతోంద‌ని అధ్య‌య‌నాల్లో తేలింద‌న్నారు. అందువ‌ల్లే ముఖ్య‌మంత్రి ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, టిటిడి ఈ విష‌యంలో రెండు అడుగులు ముందుకేసింద‌ని చెప్పారు.

నవనీత సేవ

– దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి వెన్న తయారుచేసి, తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నవనీత సేవను ప్రారంభించాం. తిరుమ‌ల గోశాలలో కనీసం 150 పాలిచ్చే దేశీయ గోవులను ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం

– తిరుమల తిరుపతి దేవస్థానముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగింద‌న్నారు. ఈ మందిరంలో గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలు, గోతులాభారం, గోవిజ్ఞానకేంద్రం, గోసదన్ ఏర్పాటు చేశామ‌న్నారు.

రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు..

– రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం కోసం అక్టోబరు 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎంఓయు చేసుకున్నామ‌న్నారు.

పంచగవ్య ఉత్పత్తులు

– కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్‌ స్టిక్స్‌, ఫ్లోర్‌ క్లీనర్‌ లాంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయ‌ని చెప్పారు.

గోమాత గురించి…

– భారతీయ ఆలయ సంస్కృతికి, దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజ ఆరోగ్యానికి గోవును మూలస్తంభంగా పురాణాలు చెబుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోమాత ఒకప్పుడు కీలకపాత్ర పోషించింద‌ని చెప్పారు. గోమూత్రం, పేడ ఎరువుగా పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం, ఆవు పాలు తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని, పలు వ్యాధుల నివారణకు గో పంచగవ్యాలను మందులుగా కూడా ఉపయోగించేవార‌ని, దీనివల్ల ప్రజలు ఆధునిక వైద్యం వైపు చాలా అరుదుగా వెళ్లేవారని వివ‌రించారు. సమాజంలో చోటు చేసుకున్న నూతన పోకడలు, అవస‌రానికి మించి వ్యవసాయ యాంత్రీకరణ, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు నివారణ మందులు ఉపయోగిస్తుండడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమయ్యాయ‌ని చెప్పారు.

రెండు రోజుల గోమహాసమ్మేళనం, గో ఆధారిత వ్యవసాయం శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు సమాజాన్ని పునరంకితం చేసే దిశగా పనిచేయాల‌ని ఆయ‌న కోరారు.

ప్రపంచ భవిష్యత్తుకు గో ఆధారిత వ్యవసాయ‌మే దిక్కు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఇచ్చిన విశిష్టస్థానం, మానవజాతి మనుగడకు గోమాత చేస్తున్న సేవ నేపథ్యంలో గోవిశిష్టతను చాటి చెప్పడం కోసం టిటిడి జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం నిర్వహిస్తోంద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ భవిష్యత్‌ కోసం గో ఆధారిత వ్యవసాయమే దిక్కు అన్నారు.

సనాతన హిందూ ధర్మం లో గోమాతకు విశిష్ట స్థానం

– సనాతన హిందూ ధర్మం గోమాతకు అత్యంత ప్రాధాన్యత, ప్రాశస్త్యం కల్పించింద‌ని, త్రేతాయుగంలో శ్రీ‌రామచంద్రుడు గోపరిరక్షణ చేసినందువల్లే రామరాజ్య స్థాపనతో సుపరిపాలన అందించారని తెలుస్తోందని చెప్పారు. ద్వాపరయుగంలో మహాభారత కాలంలో విరాట రాజు కొలువులో పాండవులు తమ అజ్ఞాతవ వాస కాలంలో ఉత్తర గోగ్రహణం సందర్భంగా చేసిన గోపరిరక్షణ చేయడం వల్ల కూడా వారు తిరిగి తమ రాజ్యాన్ని పొందగలిగారని మనకు తెలుస్తోందన్నారు.

– 1984, డిసెంబరు 3న మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో మిథైల్‌ ఐసో సైనేట్‌ అనే విషవాయువు లీక్‌ కావడంతో వందలాది మంది ప్రజలు చనిపోయిన దుర్ఘటన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ ఫ్యాక్టరీకి కేవలం ఒక మైలు దూరంలో ఉన్న సోహన్‌లాల్‌ కుష్వాహ, ఎంఎల్‌.రాథోర్‌ కుటుంబాలు మాత్రం ఈ దుర్ఘటన నుండి బయటపడ్డాయ‌ని, ఈ సమయంలో ఆ రెండు కుటుంబాలవారు తమ ఇళ్లలో ఆవు పిడకలు, నెయ్యితో అగ్నిహోత్రం, హోమాలు చేస్తూ ఉన్నారని, వాటి నుండి వెలువడిన హవిస్సు(పొగ) విషవాయువు ప్రభావాన్ని నిర్వీర్యం చేసిన‌ట్టు ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని తెలిపారు.

– దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గోసంరక్షణే ఏకైక మార్గమ‌ని, అందువల్లే గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమ‌ని చెప్పారు.

– స్వాతంత్య్రానంతరం వ్యవసాయంలో నూతన పోకడలతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతూ రావడం వల్ల భూమిలో ఉన్న జీవ‌రాశులు నాశనమయ్యాయ‌న్నారు. జీవ‌రాశులు, పశుపక్ష్యాదులకు సంబంధించిన ప్రకృతి సిద్ధమైన ఆహారచక్రాలు ధ్వంసమైన‌ట్టు చెప్పారు. గోమాతను సంరక్షించుకుని భూమాతను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంద‌న్నారు.

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ టంగుటూరు మారుతీప్ర‌సాద్ ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ మాతా నిర్మ‌లానంద యోగ భార‌తి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ర‌చించిన గోమ‌హ‌త్యం పుస్త‌కాన్ని ఛైర్మ‌న్‌, ఈవో ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవోలు శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, యుగ‌తుల‌సి ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు శ్రీ శివ‌కుమార్‌, సేవ్ ఫౌండేష‌న్ అధ్య‌క్షులు శ్రీ విజ‌య‌రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.