ఘ‌నంగా శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

ఘ‌నంగా శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

తిరుపతి, 2019 డిసెంబరు 10: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర ఘ‌నంగా జ‌రిగింది. ఆల‌యంలో డిసెంబ‌రు 1 నుండి 10 రోజుల‌పాటు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం సుప్ర‌భాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని శ్రీ తిరుమంగై ఆళ్వార్ స‌న్నిధికి వేంచేపు చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు, శ్రీ తిరుమంగై ఆళ్వార్‌కు వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం, సాత్తుమొర నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సందర్శించార‌ని వారి శిష్యుల మాట‌. స్వామివారిని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను గానం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఎఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శ‌ర్మ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.