జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాలలో ”గోపూజ”

జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాలలో ”గోపూజ”

తిరుపతి, 2018 జనవరి 09: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 12న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆలయాలలో ”గోపూజ” కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. గోవు విశిష్టతను తెలియజేసి ప్రజలందరూ గోసంరక్షణకు పాటుపడేలా చైతన్యపరిచేందుకు ప్రతి ఏడాది టిటిడి గోపూజ నిర్వహిస్తున్న విషయం విధితమే.

గోసంరక్షణ కోసం టిటిడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆదర్శ గోశాల ఏర్పాటు, పంచగవ్య ఔషధాల ప్రాధాన్యాం, గోసంరక్షణ ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా టిటిడి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలోను హెచ్‌డిపిపి ఆధ్వర్యంలో ”గోపూజ” నిర్వహించనున్నారు.

”గావ: ప్రతిష్ఠా సచరాచరస్య” చరాచరవిశ్వానికి గోవులే ఆధారం. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.

టిటిడి విద్యాసంస్థలలో ”సదాచారం”ప్రారంభం

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలలో మంగళవారం సాయంత్రం ”సదాచారం” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా విద్యార్థులకు భారతీయ సనాతన ధర్మం, నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు వాటి విశిష్టత వంటి అంశాలను తెలియచేయనున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు సదాచారంపై వారానికి ఒక్క క్లాస్‌ నిర్వహిస్తారు. ఇందులో నిష్ణాతులైన ప్రముఖ పండితులు, ఉపాధ్యాయులు బోధిస్తారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన ‘గో మహోత్సవం’

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ మంగళవారం ‘గో మహోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించనున్నారు. కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా కనుమ పండుగ నాడు ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8.00 నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటం నిర్వహిస్తారు.

ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.30 గంటల నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.