‘టిటిడిలో ‘గోల్డ్‌’ మాల్‌’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

వివరణ(తిరుపతి, ఏప్రిల్‌  22, 2013)

‘టిటిడిలో ‘గోల్డ్‌’ మాల్‌’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం

ఏప్రిల్‌ 21వ తేదీన సాయంత్రం 6.30 నుండి 6.45 గంటల వరకు ”సివిఆర్‌ న్యూస్‌” ఛానల్‌ నందు ‘టిటిడిలో ‘గోల్డ్‌’ మాల్‌’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం. దీనికి సంబంధించిన వాస్తవ వివరాలను కింద తెలియజేస్తున్నాము.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పలు రకాల ఆభరణాలను స్వామివారి హుండీలో సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని సంవత్సరాలుగా ముంబయిలోని భారత ప్రభుత్వ మింట్‌కు ఇలాంటి ఆభరణాలను తరలించి కరిగించి, శుద్ధిచేసి గోల్డ్‌బార్‌లుగా మారుస్తోంది. 2010వ సంవత్సరం నుండి తితిదే ఈ పద్ధతికి స్వస్తి పలికింది. జాతీయ బ్యాంకులతో గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒప్పందం చేసుకోవడమే దీనికి కారణం.

రోజువారీ భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని జ్యూవెలరీ అప్రైజర్‌ విభజించి వివరాలను నమోదు చేస్తారు. నెలకోసారి ఈ ఆభరణాలను తిరుపతిలోని తితిదే ఖజానాకు పంపుతారు. రోజువారీ ఆభరణాల విభజన మరియు వివరాల నమోదు ప్రక్రియ శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగంలో ఉప కార్యనిర్వహణాధికారి(పరకామణి), సహాయ కార్యనిర్వహణాధికారి(పరకామణి), జ్యువెలరీ అప్రైజర్‌, జీయంగార్‌ క్లర్క్‌ మరియు డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(విజిఓ) సమక్షంలో జరుగుతుంది. బంగారు ఆభరణాలను 1.ప్రైమరీ గోల్డ్‌, 2.గోల్డ్‌ ఆర్నమెంట్స్‌, 3.గోల్డ్‌ ఆర్టికల్స్‌, 4.గోల్డ్‌ ఆన్‌ కాపర్‌, 5.డైమండ్‌ జ్యూవెలరీ, 6.స్టోన్స్‌ గోల్డ్‌గా విభజిస్తారు.
ఇలా పరిశీలించి విభజించిన ఆభరణాలను ఖజానాలో మళ్లీ నెలకోసారి పున:పరిశీలన చేస్తారు. తితిదే ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి, ఉప కార్యనిర్వహ ణాధికారి(పరకామణి), సహాయ కార్యనిర్వహణాధికారి(ఖజానా), సహాయ కార్యనిర్వహణా ధికారి(పరకామణి), జ్యువెలరీ అప్రైజర్‌(పరకామణి), డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(విజిఓ), జీయంగార్‌ క్లర్క్‌ సమక్షంలో ఖజానా అప్రైజర్‌ పున:పరిశీలన చేస్తారు. ఇందులో బంగారు నగలను జాగ్రత్తగా పరిశీలించి తూకం వేసి ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి సీల్‌తో సీలు వేస్తారు. సహాయ కార్యనిర్వ హణాధికారి(ఖజానా) ఖజానాలోని స్ట్రాంగ్‌రూములో గల సేఫ్‌ లాకర్లలో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియను మొత్తం సిసిటివిల్లో రికార్డు చేస్తారు. ఇలా పరిశీలించిన ఆభరణాల బరువు ఇతర వివరాలను ఫిజికల్‌ వెరిఫికేషన్‌ రిజిస్టర్‌లో, రెండు తాళాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

ఇలా నిర్ణీత పరిధి వరకు పోగయిన ఆభరణాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ముంబయిలోని భారత ప్రభుత్వ మింట్‌కు తరలిస్తారు. తితిదే నుండి భారత ప్రభుత్వ మింట్‌ అధికారులు వర్క్‌ ఆర్డరు తీసుకుని బంగారు నగలను కరిగించి, శుద్ధిచేసి గోల్డ్‌బార్‌లు తయారుచేసే ప్రక్రియను మొదలుపెడతారు. ఇందులోవచ్చే తరుగును అన్ని వివరాలతో తితిదే కార్యనిర్వహణాధికారికి పంపుతారు. అదేవిధంగా ఆ వివరాలను తితిదే పాలకమండలిలో చర్చించి తరుగుదలపై ఆమోదం తీసుకుంటారు.

శ్రీవారి పరకామణి, తితిదే స్థానిక ఆలయాల నుండి అందే ఆభరణాల్లో 22 క్యారెట్లు లేదా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఉండడం లేదు. బంగారు సమర్పించే వివిధ ఆభరణాలు 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లుగా ఉంటున్నాయి. భారత ప్రభుత్వ మింట్‌ నిర్దేశించిన ప్రకారం బంగారు ఆభరణాల్లో 70 శాతం నుండి 80 శాతం స్వచ్ఛత ఉండాలి. రాగినగలపై పూత పూసిన బంగారంలోనూ 40 శాతం నుండి 50 శాతం స్వచ్ఛత ఉండాలి. తక్కువ స్వచ్ఛత గల బంగారు ఆభరణాలను కరిగించినప్పుడు తరుగులోనూ తదనుగుణంగా తేడాలు కనిపిస్తాయి. ఈ మేరకు బంగారు నగలను కరిగించే ప్రక్రియను పూర్తి చేసి గోల్డ్‌బార్‌లను భారత ప్రభుత్వ మింట్‌ తితిదేకి అందిస్తుంది.  దీనిపై నడిచిన ఫైల్స్‌, రికార్డులను రాష్ట్ర ఆడిట్‌ విభాగం ఆడిట్‌ చేస్తుంది.
ఇక ఆభరణాల తూకం విషయానికొస్తే భారత ప్రభుత్వ మింట్‌లో సిసిటివి కెమెరాల  నిఘా మధ్య సంప్రదాయ వేయింగ్‌ స్కేల్‌తో ఆభరణాలను తూకం వేస్తారు. తితిదే మాత్రం డిజిటల్‌ వేయింగ్‌ స్కేల్స్‌ను వినియోగిస్తోంది. ప్రస్తుతం తితిదే ఖజానాలో ఉన్న వేయింగ్‌ స్కేల్స్‌పై ప్రభుత్వ తూనికలు, కొలతల శాఖ ముద్ర కూడా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్‌ ఎం.జగన్నాథరావు కమిటీ కూడా తితిదే ఆభరణాల భద్రతకు చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. తిరుమలలోని బొక్కసం, పరకామణి, తిరుపతిలోని ఖజానాలో గల కాయిన్స్‌ పరకామణి,  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కానుకల లెక్కింపునకు సంబంధించి పటిష్టమైన పద్ధతులను తితిదే అవలంబిస్తోందని కమిటీ పేర్కొంది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా ఆభరణాల రిజిస్టర్లు పక్కాగా ఉన్నాయని నివేదించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆభరణాలను రెండు తాళాల పద్ధతిలో భద్రపరుస్తున్నందున ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేదని కమిటీ వెల్లడించింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న ఖజానాకు సైతం కట్టుదిట్టమైన భద్రత కల్పించారని నివేదికలో పేర్కొంది.

అదేవిధంగా తితిదే ఖజానా విధివిధానాలు, పద్ధతులను పరిశీలించిన జస్టిస్‌ డి.పి.వాద్వా కమిటీ 2011, జనవరి 21న తన నివేదికను తితిదేకి సమర్పించింది. ఈ కమిటీ తన పరిశీలనలో ట్రెజరీ చలానా రిజిస్టర్‌, ఫిజికల్‌ వెరిఫికేషన్‌ రిజిస్టర్‌, ఇతర రిజిస్టర్లను పక్కాగా నిర్వహిస్తున్నట్టు గుర్తించింది. ఇందులో గోల్డ్‌, గోల్డ్‌ ఆర్నమెంట్స్‌, గోల్డ్‌ ఆర్టికల్స్‌, స్టోన్స్‌ గోల్డ్‌, గోల్డ్‌ ఆన్‌ కాపర్‌, ఆర్నమెంట్స్‌ విత్‌ జ్యువెల్స్‌, రాళ్లు, పెరల్స్‌ మరియు కొరల్స్‌ను రిజిస్టర్లలో పక్కాగా నమోదు చేస్తున్నట్టు ప్రశింసించింది.

ముంబయిలోని భారత ప్రభుత్వ మింట్‌లో తరుగు రూపంలో కిలోల బంగారం మాయమవుతోందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. బంగారం స్వచ్ఛతను బట్టి తరుగు వస్తుందన్న వాస్తవాన్ని సదరు చానల్‌ గుర్తుంచుకోవాల్సి ఉంది. వాస్తవాలు ఇలా ఉండగా మీరు ప్రసారం చేసిన వార్తా కథనం అభూతకల్పనలతో భక్తులను అయోమయంలో పడేసేలా ఉంది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి తప్పుడు కథనాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం మంచిదికాదు.

కావున పైన తెల్పిన వాస్తవాల్ని మీ ఛానల్‌ నందు వివరణగా ప్రసారం చేయాల్సిందిగా కోరడమైనది.


ప్రజాసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి