తిరుపతిలో రేపు భాగవత సప్తాహం ప్రారంభం

తిరుపతిలో రేపు భాగవత సప్తాహం ప్రారంభం

తిరుపతి, ఏఫ్రిల్‌-4, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ పరిషత్‌ ఆధ్వర్యంలో ఏఫ్రిల్‌ 5వ తేది నుండి 11వ తేది వరకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణి ప్రాంగణంలో భాగవత సప్తాహం నిర్వహిస్తారు.

తితిదే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి ఏఫ్రిల్‌ 5న సాయంత్రం 6.15 గంటలకు ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. కూర్తాళంకు చెందిన శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతి అయిన పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు భాగవత ప్రవచనం చేస్తారు.

భారతీయ ఆత్మౌన్నత్యానికి, పారమార్ధిక వైభవానికి తాత్విక చింతనకు శిఖరాయమానంగా నిలచిన ధార్మిక, విజ్ఞానిక, సాంస్కృతిక భాండాగారాలు భారత భాగవత రామాయణేతిహాసాలు. మానవ వికాస చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతజాతి నాగరికత మహోజ్వలంగా, విశ్వమానవాళికి మార్గదర్శకంగా నిలచిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు.

వీటిలో వ్యాసప్రోక్తమై శుఖముఖ వికసితమై వెలసిన శ్రీమద్భాగవతం ఒక కల్పద్రుమం. చతుర్వేద సారాన్ని, సారాంశాన్ని మిళితం చేసుకొన్నది కనుకే భాగవతం తత్వ విచార వేదికగా భాసిల్లుతోంది. మానవ సామాజిక ధర్మస్పూర్తికి, భగవత్తత్వానికి మధ్య అంతర్లీనంగా ఉన్న తాత్విక నేపథ్యాన్ని వివరించే దార్శనిక సార సంగ్రహం ఇది. భగవంతుని గూర్చిన పురాణం, భగవద్భక్తుల కథాసార సంగ్రహం భాగవతం. అడుగడుగునా భగవంతుని దర్శింపజేసే శ్రీహరి దివ్యలీలామృతం భాగవతం.
కనుక పురప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొని చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా ఏఫ్రిల్‌ 5వ తేది సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు ఎన్‌.టి.ఆర్‌ నటించిన  ”రామాయణం” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.