ధర్మప్రచార మండలి సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2012 ఆగస్టు 28: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ధార్మిక కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం ధర్మప్రచార మండలి సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులకు వయసు 35 నుండి 60 సంవత్సరముల లోపు ఉండి హిందూ ధర్మం, వ్యవస్థలు, సంప్రదాయాల పట్ల విశ్వాసం కలిగి, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సేవా దృక్పథంతో కేవలం భగవత్సేవకులుగా పనిచేసే స్వభావం కలిగి ఉండాలి. ఈ ధార్మిక మండలి సభ్యత్వాన్ని వ్యక్తిగత, వ్యవస్థాగత హోదాగా పరిగణించకుండా, ధర్మప్రచార నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేయగలిగిన ఆలోచన ఉన్నవారై ఉండాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా అర్హులే. సభ్యులకు కేవలం విధి నిర్వహణలో అయ్యే రవాణా భత్యం చెల్లిస్తారు.

ఈ జిల్లాస్థాయి మండలిలో 15 మంది సభ్యులు ఉంటారు. వారిలో ఒకరిని ధార్మిక మండలి అధ్యకక్షులుగా, మరొకరిని కార్యదర్శిగా వారి విద్యార్హతలు, నడవడిక సేవాదృక్ఫథంను బట్టి సభ్యులందరూ సమష్టిగా ఎంపిక చేసుకుంటారు. తిరిగి ఒక సంవత్సరం తర్వాత మరొకరికి అవకాశం కల్పించబడుతుంది. ఇందులో షెడ్యూల్డ్‌ కులాలు/షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ఇద్దరు, మహిళలు ఇద్దరు సభ్యత్వం కలిగి ఉంటారు. దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణమండపాలు, సమాచార కేంద్రాల నుండి పొందొచ్చు. పై నియమాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞపత్రం ఇచ్చినవారికి మాత్రమే దరఖాస్తులు అందజేస్తారు. దరఖాస్తుదారులపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు. శిక్షలు అనుభవించి ఉండరాదు.

పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 30వ తేదీలోపు ”ప్రత్యేకాధికారి, హిందూ ధర్మప్రచార పరిషత్తు, పాత హుజూరు కార్యాలయం, గోవిందరాజస్వామి గుడి వెనుక భాగము, తిరుపతి, పిన్‌ : 517501” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపే కవరుపై ధర్మప్రచార మండలి కోసం దరఖాస్తు అని రాయాల్సి ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.