ధార్మిక ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలి : తితిదే ఈవో

ధార్మిక ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలి : తితిదే ఈవో

తిరుపతి, మే 6, 2013: సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భక్తులను భాగస్వాములను చేయాలని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ధర్మప్రచార మండళ్ల సభ్యులకు సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం ఉదయం ఏడు జిల్లాలకు చెందిన ధర్మప్రచార మండళ్ల సభ్యులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ ఆధ్యాత్మికత తక్కువగా ఉన్న నేటి సమాజం అనేక రుగ్మతలకు కారణమవుతోందన్నారు. పరస్పరం అనురాగం, గౌరవభావంతో ప్రతి జిల్లాలో ధార్మికప్రచారం చేసేందుకు రెండు సంవత్సరాలకు సరిపడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తుల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. శ్రీవారి సేవకులుగా పనిచేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర, ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాథ్‌, డెప్యూటీ ఈవో శ్రీ ఉమాపతిరెడ్డి, పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య హెచ్‌ఎస్‌.బ్రహ్మానందం, కో-ఆర్డినేటర్‌ శ్రీ సాయిరాం ఇతర అధికారులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.