నవంబర్‌ 17 నుండి నారాయణవనం శ్రీ‌ కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు

నవంబర్‌ 17 నుండి నారాయణవనం శ్రీ‌ కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, 2010 నవంబర్‌-16: తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్వర్యంలో నడుస్తున్న ఉప ఆలయాల్లో ఒకానొక ప్రధాన ఆలయమైన నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబర్‌ 17 నుండి 21 వరకు తెప్పోత్సవాలు అంగరంగవైభవంగా జరుగనున్నాయి.

ఈ 5 రోజుల తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సర్వాలంకారభూషితుడైన స్వామివారు శ్రీ సీతాలక్ష్మణసమేత శ్రీ రామచంద్రస్వామి అలంకారంలో తిరువీధుల్లో ఊరేగుతారు. రెండవ రోజు అండాళ అమ్మవారి అలంకారంలో, చివరి మూడు రోజులు స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధులలో ఊరేగుతారని ఆలయ అధికారులు తెలిపారు.

ఇక ఆలయ చారిత్రక ప్రాశస్త్యం ప్రకారం నారాయణవనంలోనే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి శ్రీ వేంటేశ్వర స్వామివారిని ప్రేమించి వివాహం చేసుకున్నదని తెలుస్త్తూంది. ఈ సందర్భంగా పద్మావతిదేవి సోదరుడు రెండు ఆలయాలు కూడా నిర్మించినట్లు చరిత్ర చెబుతూంది. ఇందులో ఒక ఆలయం నారాయణవనంలో వుండగా మరో ఆలయం తిరుమలలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా స్వామివారి ఆలయంలో వివిధ రకాలైన సేవలు, ఉత్సవాలు క్రమం తప్పకుండా జరుగుచున్నాయి. కాగా తిరుపతికి 35 కి.మీ. దూరంలో ప్రస్తుతం వెలసియున్న ఈ ఆలయాన్ని విజయనగర రాజులు కూడా నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతూంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.