EXTENSIVE DHARMIC PROGRAMS AND TEMPLES BUILDING IN THE LAST 54 MONTHS- TTD EO REPUBLIC SPEECH_ నాలుగున్నర ఏళ్లలో విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలు, ఆలయాల నిర్మాణం- గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

  • UNPARALLELED HEART OPERATIONS AND HEART TRANSPLANTS

•  HOUSE SITES TO ALL EMPLOYEES BY FEBRUARY END

•  TTD EO REPUBLIC DAY SPEECH

Tirupati, 26 January 2024: TTD EO Sri AV Dharma Reddy reiterated that by this February end all employees would be given house sites and TTD is committed towards taking up extensive Sanatana Hindu Dharma Prachara programs, temple-building activities and devotees-friendly programs.

Earlier he unfurled the National tri colour flag at the parade grounds behind the TTD administrative building on Friday on the occasion of 75th Republic Day celebrations and received guard of honour presented by TTD vigilance cadres.

TTD Chairman Sri Bhumana Karunakar Reddy graced the occasion as the chief guest and some other board members were also present.

Speaking later he said during last four and half years the pace of development activities, Dharmic propagation, temple building and heart operations cu, transplants were on a great stride.

Excerpts of his Republic Day speech 

.

•  Vaikunta Ekadasi: TTD observed the Vaikuntadwara Darshanam from December 23January 1 for ten days and nearly 6.47 lakh devotees had darshan.

Ratha sapthami 

•  On February 16 TTD will be observing Ratha Sapthami fete which is hailed as Srivari mini Brahmotsavam

•  On this occasion Sri Malayappaswami will bless devotees riding on Surya Prabha, Chinna Sesha, Garuda, Hanumanta, Kalpavruksha, Sarva Bhupala, and Chandra Prabha Vahana on a single-day.

 

On the prestigious Ayodhya Sri Ram mandir Prana Pratista event on January 22, TTD presented One lakh small laddus as Srivari Prasadam.

For the welfare of humanity, TTD participated in the Koti Hanuman Chalisa Parayana Maha Yajnam 

In order to inspire youth in Sanatana Hindu dharma and on lines of Ramakoti TTD has introduced Govinda Koti books

From February 3-5, Sri Venkateswara Dharmika Sadassu will be organised in a big way inviting Swamiji’s, Peethadhipatis from all over the country

For the safety of devotees coming to Tirumala via footpath routes to redeem their vows,  TTD has introduced various safeguards from wild animal threats.

For the benefit of devotees who got Arjita Seva tickets through lucky dip, TTD has introduced Pay link facility for direct payment through net banking, UPI, credit cards or debit cards online through SMS to avoid rushing to counters and get prints of tickets.

TTD has introduced a unique Caution deposit refund tracker for the benefit of devotees seeking a refund.

Through SRIVANI Trust funds  TTD has constructed thousands of temples. Besides TTD is providing ₹5000 to each temple for Dhoopa and Deepa rituals.

At the TTD-run Sri Padmavati  Children’s Heart Centre(SPCHC) so far  2330 operations have been carried out besides eleven Heart Transplants.

To provide the best medication to children, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy has aimed at commencing a super speciality paediatric hospital in the state of Andhra Pradesh at the Lotus feet of Sri Venkateswara Swamy giving new lease of life to scores of children.

A seven-floor hospital is being built at ₹230 crore. Similarly, the SVIMS, BIRRD and Ayurveda hospitals are renovated with the latest medical equipment and new blocks to facilitate the poor devotees with quality healthcare.

The SV Vedic University has set up a Vedic heritage corridor to showcase the utility of Vedic science in day-to-day lifestyle.

All the TTD educational institutions are upgraded as NAAC + rank. The SV Arts College, SGS Arts College, Sri Padmavati Mahila degree and PG College have also bagged autonomous status for a decade.

TTD has signed a  MoU with Smt Sulochana Singhania Trust to upgrade the educational standards of SV High School at Tirumala.

Gosamrakshana gets priority and TTD’s motto is that worshipping Gomata is equal to worshipping Sri Venkateswara.

He gave a clarion call to the employees to remain ever dedicated to serve devotees and sustain the reputation of the institution.

He also complimented the Vigilance department for their attractive Republic Day Parade arrangements and activities.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నాలుగున్నర ఏళ్లలో విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలు, ఆలయాల నిర్మాణం

– ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు

– ఫిబ్రవరి నెలాఖరులోగా ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు

– గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 26 జ‌న‌వ‌రి, 2024: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి భద్రతాసిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఈవో ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

       ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మికసంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తలమండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతాసిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

      స్వాతంత్య్రానంతరం మ‌న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ ప‌ర్వ‌దినం రోజున‌ స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున టీటీడీ భక్తులకు అందిస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

శ్రీవారి ఆలయం :  

– టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా, దోష‌ర‌హితంగా నిర్వహిస్తున్నాం.

వైకుంఠ ఏకాద‌శి :

– వైకుంఠ ఏకాదశి ప‌ర్వ‌దినం సందర్భంగా డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారం తెరిచి సుమారు 6.47 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం, వైకుంఠ ద్వార దర్శనం కల్పించాం. ఎంతో మంది భ‌క్తులు స్వామివారిని ఈ పండుగ‌రోజుల్లో సంతోషంగా ద‌ర్శించుకున్నారు.

విజ‌య‌వంతంగా శ్రీ‌వారి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు :

– గ‌త ఏడాది సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం. ల‌క్ష‌లాది మంది సామాన్యభ‌క్తులు బ్ర‌హ్మోత్స‌వాల్లో సంతృప్తిక‌రంగా స్వామివారి వాహ‌న‌సేవల ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఏ చిన్న‌పాటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి, అన్న‌ప్ర‌సాదం, ల‌డ్డూప్ర‌సాదాలు అందించాం.

రథసప్తమి :

– ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించ‌నున్నాం. ఈ పండుగ‌కు శ్రీ‌వారి అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని పేరు.

– ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు వైభ‌వోపేతంగా దర్శనమిస్తారు.

అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం :

– అయోధ్యలో ఈ నెల 22వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా జ‌రిగిన‌ శ్రీ‌రామమందిరం ప్రారంభోత్స‌వం, బాలరాముని విగ్రహప్రతిష్ట సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మన్ శీ భూమన కరుణాకరరెడ్డి ఒక ల‌క్ష చిన్నల‌డ్డూల‌ను మందిర కమిటీకి అందజేసి భక్తులకు పంపిణీ చేయించారు.

కోటి హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణ మ‌హాయ‌జ్ఞం :

– హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌ల‌మైన తిరుమ‌ల అంజ‌నాద్రి ప‌ర్వ‌త ఆశ్ర‌యంగా విశ్వ‌శాంతి కోసం ల‌క్షమందితో జ‌న‌వ‌రి 21న తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ ఔట్‌డోర్ స్టేడియంలో కోటి హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణ మ‌హాయ‌జ్ఞం జ‌రిగింది. టీటీడీ సౌజ‌న్యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ఎంతో సంతోషంగా ఉంది.

గోవిందకోటి :

– యువతలో హైందవ సనాతన ధర్మవ్యాప్తి కోసం 25 ఏళ్ల లోపు వారికి రామకోటి తరహాలో గోవిందకోటి పుస్తకాలను అందుబాటులో ఉంచాం. ఒక్కో పుస్తకంలో 39,600 గోవిందనామాలు వంతున, 26 పుస్తకాలలో 10 లక్షలా 1,116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం. అదేవిధంగా 253 గోవిందకోటి పుస్తకాలలో కోటి సార్లు రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబసభ్యులు ఐదుగురితో కలిసి ఒకసారి తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం, వసతి కల్పిస్తాం. న‌వ‌విధ‌భ‌క్తి మార్గాల‌లో ఒక‌టైన నామ‌స్మ‌ర‌ణ‌భ‌క్తికి ఇదొక చ‌క్క‌టి రాజ‌మార్గం. టీటీడీ ముద్రించిన పుస్తకాలే కాకుండా ఏ పుస్తకాల్లోనైనా గోవింద కోటి రాయవచ్చు.

భగవద్గీత :

– సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతికవిలువల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీతను లక్ష పుస్తకాలను ముద్రించాం. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీష్‌, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా శ్రీ‌వారి పుస్త‌క ప్ర‌సాదంగా అంద‌జేస్తున్నాం.

ధార్మిక స‌ద‌స్సు :

–  తిరుమలలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మికసదస్సు పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌నున్నాం. దేశవ్యాప్తంగా గల మఠాలు, పీఠాలకు చెందిన స్వామీజీలతోపాటు భావసారూప్యం గల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు విచ్చేయనున్నారు. ధార్మిక సంప‌న్నుల‌కు ఈ స‌ద‌స్సు ఎంతో విజ్ఞాన‌దాయకం. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలతో సనాతన ధర్మాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్తాం.

శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం :

– తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో 2023, నవంబరు 23 నుండి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించి నిర్వహిస్తున్నాం. ఈ హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో సుపథం మార్గం ద్వారా రూ.300/- టికెట్‌ కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే స‌ద‌వ‌కాశాన్ని కల్పించాం.

న‌డ‌క‌మార్గాల్లో భ‌క్తుల ర‌క్ష‌ణ చ‌ర్య‌లు

– తిరుమ‌ల న‌డ‌కమార్గాల్లో వ‌న్య‌మృగాల నుండి భ‌క్తుల ర‌క్ష‌ణ కోసం అట‌వీశాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం అటవీశాఖకు రూ.5 కోట్లు కేటాయించాం. భక్తులు భయం లేకుండా తిరుమల నడకమార్గంలో రావచ్చు.

కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం :

– రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో 2023 ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు అత్యంత ప‌విత్రంగా నిర్వహించాం. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తిరుమల జలాశయాలు అడుగంటాయి. నీటి కోసం రూ.40 కోట్లతో కండలేరు నుంచి పైపులైన్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేయడం జరిగింది. అయితే స్వామివారి దయతో డిసెంబర్ 6న ఒకేరోజు కురిసిన వర్షంతో తిరుమలలోని నాలుగు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. రాబోయే రెండేళ్లు తిరుమలకు నీటి సమస్య ఉండదు.

భక్తులకు ‘‘పే లింక్‌’’ ఎస్‌ఎంఎస్‌ :

– తిరుమ‌ల సిఆర్‌ఓలో లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పేలింక్‌ పంపుతున్నాం. భక్తులు తిరిగి కౌంటరు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యుపిఐ లేదా క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్‌ తీసుకోవచ్చు. త‌ద్వారా భ‌క్తుల‌కు స‌మ‌యం ఆదా అవుతోంది.

కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ :

– తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్‌ డిపాజిట్‌ ప్రస్తుతస్థితిని తెలుసుకునేందుకు వీలుగా టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ను పొందుపరిచాము. భక్తులు గది బుక్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అకామడేషన్‌ – బుకింగ్‌ హిస్టరీ – ఆఫ్‌లైన్‌ అకామడేషన్‌ సిడి రీఫండ్‌ ట్రాకర్‌ను క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం :

– టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) ద్వారా రూ.370 కోట్లతో 3,615 ఆలయాల నిర్మాణం చేపట్టాం. 700 ఆలయాల నిర్మాణం పూర్తయింది. మిగతా ఆలయాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. ఏప్రిల్ నాటికి వీటిని పూర్తి చేస్తాం. శ్రీకృష్ణదేవరాయల పాలనను మైమరపించేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, ఆలయ నిర్మాణాలు చేపట్టాం. విమర్శలు చేసే వారికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించిన ఆలయాల సమాచారమే సమాధానం.

అచ్యుతం, శ్రీ‌ప‌థం బ్లాక్‌ల నిర్మాణం :

– భ‌క్తుల‌కు మ‌రింత మెరుగ్గా బ‌స క‌ల్పించ‌డంలో భాగంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవ‌స‌ర‌మైన వాటిని ఆధునీక‌రిస్తున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో రూ.300 కోట్లతో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.300 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మిస్తున్నాం. తిరుపతిలో  20 వేల నుంచి 25 వేల మంది భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.

టీటీడీ ఆసుపత్రులు :

– శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో 26 నెలల్లో 2,350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. రెండు రోజుల వయసు గల చంటిపాపకు కూడా గుండె ఆపరేషన్ చేయడం విశేషం. రాష్ట్రంలో తొలిసారిగా 11 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేపట్టాం. దీనిని ‘‘శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయాలయం’’ పథకంగా నామకరణం చేశాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అభీష్టం మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.230 కోట్లతో తిరుపతిలో ఏడు ఫ్లోర్లతో చిన్నపిల్లల మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పూర్తయింది. త్వరలో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తాం. గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి గురించి అమెరికాలో కొంత మంది వైద్యులకు తెలుపగా ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం :

– వేదాల్లోని అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ, గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారం తీసుకోవాల్సిన విధానం లాంటి దాదాపు 190 అంశాలను భావితరాలకు తెలియజేసేందుకు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదిక్‌ హెరిటేజ్‌ కారిడార్‌ను ప్రారంభించింది. దీనిద్వారా ఆధునిక జీవనవిధానంలో వేదవిజ్ఞానం ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. నిర్ణీతసమయంలో ఎవరైనా వచ్చి ఈ చిత్ర ప్రదర్శనను చూసి, వైజ్ఞానిక‌ విషయాలను తెలుసుకోవచ్చు.

– ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో జన్మ, మృత్యురహస్యాలు, మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన విజ్ఞానంపై ప్రత్యేకంగా అతీంద్రియ విజ్ఞానం కోర్సును నూత‌నంగా ప్రారంభించాం. ఇది చాలా ఉపయోగకరం.

విద్యాసంస్థలు :

– ఏడాది కాలంలోనే టీటీడీలోని అన్ని కళాశాలలకు న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ రావడం సంతోషదాయకం. ఇది గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం కూడా. ప్రైవేట్ కళాశాలలకు తీసిపోని విధంగా ఇక్కడ విద్యను అందిస్తున్నాం.

– టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌ల‌కు అటానమస్‌ హోదా లభించింది.

– తిరుమల శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో అత్యుత్తమ విద్యాప్రమాణాల కోసం దేశంలోనే ప్రసిద్ధిచెందిన శ్రీమతి సులోచనాదేవి సింఘానియా ట్రస్టుతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ పాఠశాల రెండేళ్లలో దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం ఉంది.

గోసంరక్షణకు పెద్దపీట :

– దేశవాళీ గోజాతుల అభివృద్ధి, సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. పిండ మార్పిడి పద్ధతిలో  – రానున్న 5 సంవత్సరాలలో 500 దూడలు జన్మించనున్నాయి. గోవుల‌కు మేలురకపు సమతుల్య పశుదాణాను ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. స్వామివారికి అర్పించిన పుష్పాలు, గోమయంతో కలిపి తయారు చేస్తున్న అగరబత్తీలకు భ‌క్తుల నుండి విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. గోమాత‌ను పూజిస్తే గోవిందుడు సంతోషిస్తాడ‌నే ధ్యేయంతో టీటీడీ ముందుకు సాగుతోంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా రూ.60 కోట్ల సహకారంతో మేలుజాతి దేశీయ గోవులను ఉత్పత్తి చేస్తాం. వీటిని రైతులకు అందించడం ద్వారా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి వ్యాధులు రాకుండా సమాజాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం.

హిందూ ధర్మప్రచారం:

– సనాతన హిందూ ధర్మప్రచారాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో భాగంగా టీటీడీ హిందూ ధార్మికప్రాజెక్టులను కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. హిందూ ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్యప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు, ఆళ్వార్‌ మరియు నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణంప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలతో హిందూ ధర్మప్రచారాన్ని అత్యంత విస్తృతంగా ముందుకు తీసుకెళుతున్నాం.

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల వారికి శ్వేత ఆధ్వర్యంలో అర్చక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ :

– అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవాన్ని, లోకకల్యాణం కోసం టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ధార్మిక, వైదిక క్రతువులు, సనాతనధర్మప్రచారం కోసం నిర్వహిస్తున్న పారాయణాలు, విద్య, వైద్య రంగాలలో అందిస్తున్న సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తిఛాన‌ల్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటికి తెలియజేసేలా నిరంతరాయంగా ప్రసారాలను అందిస్తోంది.

– ఎస్వీబీసీ తన 15 ఏళ్ల‌ ప్రస్థానంలో తెలుగు ఛాన‌ల్‌తో ప్రారంభమై నేడు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో నాలుగు ఛానళ్లుగా రూపాంతరం చెంది నాణ్యతా ప్రమాణాలలో రాజీ లేకుండా భక్తజనరంజకంగా శ్రీనివాసుని తత్త్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది.

ఉద్యోగులకు సంబంధించి :

– టీటీడీ ఉద్యోగుల న్యాయ‌మైన కోరిక‌లను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించి వారి సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్నాం.

– శ్రీ భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అంతరం ఇంటి స్థలాల కోసం ముఖ్యమంత్రివర్యులతో మాట్లాడారు.

– ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేస్తున్నాం. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేశాం. రెండో దఫా జనవరి 8న 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపట్టాం.

– మూడో దఫాలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 450 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఫిబ్రవరి నెలాఖరులోపు ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, మిగిలినఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టు అవుతుందని ఈ సంద‌ర్భంగా తెలియజేస్తున్నాను.

– టీటీడీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్‌ఎంఎస్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుండి రూ.17 వేలకు పైగా పెంచడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఎవ్వరికీ రూ.17 వేలకు తక్కువ కాకుండా వేతనాలు అందించేలా టీటీడీ ఛైర్మన్ కృషి చేశారు.

– శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగస్తులను ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాలలో ఇకనుంచి ప్రతి సంవత్సరం 3 శాతం వేతనం పెంచేందుకు టీటీడీ పాల‌క‌మండ‌లి ఆమోదం తెలిపింది. తద్వారా దాదాపు 6,600 మంది ఉద్యోగస్తులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇందులో ఇఎస్‌ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ వర్తింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇపుడు కార్పొరేషన్‌లోకి మారిన ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి రెండు సంవత్సరాల‌ గత సేవలకు మూడు శాతం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు నిర్ణయించి అమలు చేస్తున్నాం.

– కార్పొరేషన్‌ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏకారణంచేతనైనా అకాలమరణం పొందిన యెడల రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఆ కుటుంబంలో ఎవరికీ ఉద్యోగం లేకపోతే ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

– శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు సేవ చేస్తే భ‌గ‌వంతుడికి సేవ చేసిన‌ట్టే. ఈ విష‌యాన్ని ఉద్యోగులు గుర్తించి భ‌క్తుల సేవ‌లో పున‌రంకితం కావాల‌ని ఈ సంద‌ర్భంగా మ‌రోసారి కోరుతున్నాను. అదేవిధంగా రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా చ‌క్క‌టి ప‌రేడ్ ఏర్పాటుచేసినందుకు భ‌ద్ర‌తావిభాగానికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. జైహింద్‌…

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.