పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి

తిరుపతి, మార్చి 15, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుండి 11.30 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.
నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయంలో శుక్రవారం ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీమతి ఎస్‌.కె.స్వర్ణకుమారి బృందం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కడప సవేరా ఆర్ట్స్‌ శ్రీ అల్లూరి ఎం.వెంకటయ్య ”మహాజ్ఞాని మార్కండేయ పౌరాణిక పద్యనాటకం” ప్రదర్శించనున్నారు. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాల కళాకారులు త్యాగరాజ రచించిన శ్రీరామ కీర్తనలను ఆలపించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ స్వామి, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.